సినిమా రివ్యూ : లైగర్ 
రేటింగ్ : 2/5
నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, రమ్యకృష్ణ, విష్, రోనిత్ రాయ్, ఆలీ, 'గెటప్' శ్రీను, చుంకీ పాండే, 'టెంపర్' వంశీ తదితరులు
సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ
నేపథ్య సంగీతం: సునీల్ కశ్యప్
స్వరాలు : విక్రమ్ మోంట్రోస్, తనిష్క్ బగ్చి, లిజో జార్జ్, డీజీ చీతాస్, సునీల్ కశ్యప్, జానీ 
నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
దర్శకత్వం :పూరి జగన్నాథ్
విడుదల తేదీ: ఆగస్టు 25, 2022


లైగర్ (Liger)... లైగర్ (Liger Movie)... లైగర్... కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినబడుతోంది. అందుకు కారణం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అండ్ పూరి జగన్నాథ్. వీళ్ళిద్దరూ చేసిన పాన్ ఇండియా చిత్రమే లైగర్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి జగన్నాథ్ విజయం అందుకోవడం... విజయ్ దేవరకొండకు ఉత్తరాదిలో ఫాలోయింగ్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, ఆ అంచనాలకు తగ్గట్టుగా లైగర్ ఉందా? లేదా? గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఆ స్థాయి విజయం రాలేదు. ఆ లోటు లైగర్ తీరుస్తుందా?


కథ (Liger Movie Story) : లైగర్ (విజయ్ దేవరకొండ) కరీంనగర్ కుర్రాడు. తన తల్లి (రమ్యకృష్ణ) తో కలిసి ముంబై వెళతాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఛాంపియన్ కావాలనేది అతని లక్ష్యం. తల్లీ కొడుకులు కలిసి ఛాయ్ బండి పెట్టుకుంటారు. తల్లీ కొడుకుల దగ్గర రూపాయి లేదు. డబ్బులు ఇవ్వలేమని చెబుతారు. లైగర్ తండ్రితో గతంలో పరిచయం ఉండటంతో ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి క్రిస్టోఫర్ (రోనిత్ రాయ్) ముందుకు వస్తారు. కోచింగ్ తీసుకునే సమయంలో అతనికి తాన్యా (అనన్యా పాండే) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే, అతనికి నత్తి అని తెలిశాక తాన్య వదిలేసి వెళుతుంది. అది 'లైగర్'లో కసి పెంచుతుంది. ఆ కసితో ఇండియాలో ఎంఎంఎ ఛాంపియన్ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్‌కు వెళ్ళడానికి డబ్బులు లేకపోతే అమెరికాలో ఒకరు స్పాన్సర్ చేస్తారు. ఆయన ఎవరు? అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ లైగర్ జీవితంలోకి తాన్య ఎందుకు వచ్చింది? ఆమెను ఎవరో కిడ్నాప్ చేస్తే కాపాడటానికి లైగర్ ఎందుకు వెళ్ళాడు? ఆల్ టైమ్ గ్రేట్ మైక్ టైసన్‌తో ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏమైంది? అనేది మిగతా సినిమా.   


విశ్లేషణ (Liger Movie Review) : పూరి జగన్నాథ్ సినిమాలు ఫ్లాప్‌ అయ్యి ఉండొచ్చు. అయినా... ఆయనకు క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే... పూరి ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌లో ఓ మేజిక్ ఉంటుంది. సినిమా ఫ్లాప్‌ అయినా హీరో మేకోవర్‌కు పేరు వస్తుంది. హీరోను కొత్తగా చూపించడంలో పూరి ఎక్స్‌ప‌ర్ట్‌. 'లైగర్'లోనూ విజయ్ దేవరకొండ మేకోవర్ ఆకట్టుకుంటుంది. అయితే... రెగ్యులర్‌గా పూరి సినిమాల్లో ఉండే పంచ్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. 


పూరి జగన్నాథ్ సినిమాలు ఎలాగున్నా... ఆయన డైలాగులు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయి. 'లైగర్'లో అటువంటి డైలాగ్స్ మిస్ అయ్యాయి. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌కు నత్తి పెట్టడంతో పంచ్ డైలాగ్స్ రాసే ఛాన్స్ ఎక్కువ దొరకలేదు. డైలాగులతో హీరోయిజం ఎలివేట్ చేయడం పూరి జగన్నాథ్ బలం. దాన్ని పక్కన పెట్టి సినిమా చేయాలనుకున్నారు. కొత్తదనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకున్నా... కథలో కొత్తదనం లేదు. రెగ్యులర్ అండ్ రొటీన్ పూరి స్టైల్‌లో ఉంది. ఎంగేజ్ అండ్ ఎంట‌ర్‌టైన్‌ చేసే సీన్స్ తక్కువ. అమ్మాయిల గురించి రమ్యకృష్ణ చెప్పే సీన్, ఆ తర్వాత సెకండాఫ్‌లో అమ్మాయిలను దెయ్యాలు అంటూ విజయ్ దేవరకొండ చెప్పే సీన్స్ వెళతాయి. మధ్య మధ్యలో విజయ్ దేవరకొండ కొన్ని మెరుపులు మెరిపించారు. 


'రింగ్‌లో ఎదుటివ్యక్తి బలవంతుడు అనుకున్నప్పుడు... మీ నాన్నను చంపింది వాడే' అనుకోమని హీరోకి తల్లి సలహా ఇస్తుంది. అప్పుడు హీరో 'ఐడియా బావుంది' అని అంటారు. బహుశా... విజయ్ దేవరకొండకు ఆ ఐడియా నచ్చి ఈ సినిమా చేశారేమో! ఐడియాను ఎంట‌ర్‌టైనింగ్‌గా, ఎమోష‌న‌ల్‌గా చెప్పడంలో పూరి తడబడ్డారు. క్లైమాక్స్ అయితే మరీ సిల్లీగా ఉంది. అసంపూర్తిగా శుభంకార్డు వేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ ప్రేమలో పడటానికి బలమైన కారణం లేదు. ఆ ప్రేమకథ ఆకట్టుకోదు. 


సినిమాకు మరో మేజర్ మైనస్... మ్యూజిక్! పాటలన్నీ టిపికల్ బాలీవుడ్ స్టైల్‌లో ఉన్నాయి. తెలుగులో కొత్తగా విన్నవాళ్ళు డబ్బింగ్ పాటలు అనుకున్నా స‌ర్‌ప్రైజ్‌ కావాల్సిన పని లేదు. సాంగ్స్ ప్లేస్‌మెంట్‌ కూడా బాలేదు. స‌డ‌న్‌గా కొన్ని సాంగ్స్ వచ్చాయి. నేపథ్య సంగీతం కూడా సోసోగా ఉంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదని లొకేషన్స్ గట్రా చూస్తే అర్థం అవుతుంది.    


నటీనటులు ఎలా చేశారు? : విజయ్ దేవరకొండ సినిమా కోసం కష్టపడ్డారు. ఆయన కష్టం స్క్రీన్ మీద సిక్స్ ప్యాక్ రూపంలో కనిపించింది. నటుడిగా కూడా తనను తాను మార్చుకున్నారు. నత్తితో ఆ విధంగా డైలాగులు చెప్పడం అంత సులభం ఏమీ కాదు. టోటల్‌గా విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ ఆకట్టుకుంటుంది. హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ కొన్ని ప‌వ‌ర్‌ఫుల్‌ డైలాగులు చెప్పారు. నటిగా ఇటువంటి రోల్ చేయడం ఆమెకు కష్టం ఏమీ కాదు. హీరోయిన్ అనన్యా పాండే గ్లామర్ షో చేశారు. నటన ఏమంత ఆకట్టుకోదు. అలీ రెండు మూడు సన్నివేశాల్లో కనిపించారు. ఆయనతో పాటు మరో కమెడియన్ 'గెటప్' శ్రీను ఉన్నారు. వాళ్ళిద్దరి సన్నివేశాలు ఆశించిన రీతిలో నవ్వించలేదు. అయితే, ఉన్నంతలో వాళ్ళిద్దరి సీన్స్ పర్వాలేదు. రోనిత్ రాయ్, విష్, చుంకీ పాండే, 'టెంపర్' వంశీ తదితరులు స్క్రీన్ మీద కనిపించారు. కానీ, ఇంపాక్ట్ చూపించడంలో ఫెయిల్ అయ్యారు. క్లైమాక్స్‌లో గ్రేట్ మైక్ టైసన్‌ను చూడటం మంచి కిక్ ఇస్తుంది. సినిమా పూర్తయ్యాక ఆయన ఈ రోల్ ఎందుకు చేశారో? అనిపిస్తుంది.     


Also Read : హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ఎపిసోడ్ రివ్యూ: గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్థాయిని అందుకుందా?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : విజయ్ దేవరకొండ వీరాభిమానులకు ఆయన ప్యాక్డ్ బాడీ, కొన్ని సన్నివేశాలు నచ్చుతాయి. సాధారణ ప్రేక్షకులకు మాత్రం సినిమా నచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. పూరి జగన్నాథ్ మరోసారి నిరాశ పరిచారు. 'లైగర్'లో పూరి హీరో కనబడలేదు. అటు విజయ్ దేవరకొండ కూడా!


Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?