Bilkis Bano Case:


సమగ్ర విచారణ అవసరం: సుప్రీం కోర్టు 


బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. అంతే కాదు. గుజరాత్ ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.





దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను ఆగస్టు 15వ తేదీన విడుదల చేశారు. దీనిపై ఇంకా రగడ కొనసాగుతూనే ఉంది. ఇది అనుచిత నిర్ణయం అని భాజపాపై అందరూ విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అటు బాధితురాలు బిల్కిస్ బానో కూడా ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూడా. అయితే..ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టుకు గడప తొక్కింది. 11 మంది దోషుల విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ అంశాన్ని విచారించనున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. దోషుల విడుదలను రద్దు చేయాలని కోరుతూ..మహిళా హక్కుల కార్యకర్తలు రేవతి లౌల్, సుభాషిణి అలీ, రూపా రేఖా వర్మలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.  సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ, జ‌స్టిస్ సీటీ ర‌వికుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించ‌నుంది. సీనియ‌ర్ అడ్వ‌కేట్ క‌పిల్ సిబాల్‌, అడ్వ‌కేట్ అప‌ర్ణా భ‌ట్‌లు ఈ కేసు వాదించ‌నున్నారు. 


భాజపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..


ఇప్పటికే  వాళ్లను విడుదల చేయటంపై దుమారం రేగుతుండగా..ఇప్పుడు మరో విషయం ఈ వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసింది. గుజరాత్ భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. "ఈ కేసులో దోషులైన వారిలో కొందరు బ్రాహ్మణులు ఉన్నారు. వారెంతో సంస్కార వంతులు. బహుశా వారి ముందు తరం వాళ్లు చేసిన తప్పులకు వీళ్లు శిక్ష అనుభవిస్తున్నారేమో" అని గోద్రా ఎమ్మేల్యే సీకే రౌల్జీ వ్యాఖ్యానించారు. ఆ 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని ప్రతిపాదించిన వారిలో ఈ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. "15 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన వీళ్లు అసలు ఆ నేరం చేశారా లేదా అన్నది నాకు తెలియదు. మేం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే నడుచుకున్నాం. 
వాళ్ల ప్రవర్తనను గమనించి, నిర్ణయం తీసుకోవాలని మాకు సుప్రీం కోర్టు సూచించింది" అని రౌల్జీ పీటీఐతో చెప్పారు. వాళ్లను విడుదల చేసే ముందు జైలర్‌తో మాట్లాడమని అన్నారు. ఆ సమయంలోనే వారి సత్ప్రవర్తన గురించి తెలిసిందని వెల్లడించారు. వాళ్లలో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, ఎంతో సంస్కారవంతులు అని జైలర్ చెప్పినట్టు రౌల్జీ వివరించారు. "సాధారణంగా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు, 
ఎలాంటి సంబంధం లేని వాళ్ల పేర్లు కూడా తెరపైకి వస్తాయి. బహుశా వీరి ముందు తరం వాళ్లు చేసిన తప్పుల వల్ల వీరిపై అభియోగాలు వచ్చి ఉండొచ్చు. వాళ్లు నేరం చేశారా లేదా అన్నది తెలియదు కానీ..వాళ్ల ప్రవర్తన ఆధారంగానే విడుదల చేశాం" అని రౌల్జీ స్పష్టం చేశారు. 


Also Read: Pegasus Row: ఆ ఫోన్లు పెగాసస్‌కు గురైనట్టు ఆధారాల్లేవు, సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు


Also Read: తెలుగు కవులకు కేంద్ర సాహిత్య పురస్కారం-2022