Manik Saha:


సౌత్ త్రిపురలో ర్యాలీ..


త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సహా ప్రతిపక్షాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వామపక్ష  పార్టీల నేతలందరూ బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు. ఈ సమయంలోనే  బీజేపీని గంగానదితో పోల్చారు. సౌత్ త్రిపురలోని కక్రబన్‌లో జరిగిన ర్యాలీలో ఓ సభకు హాజరయ్యారు మాణిక్. ఆ సమయంలోనే ఈ కామంట్స్ చేశారు.


"ఇప్పటికీ స్టాలిన్, లెనిన్ భావజాలాన్ని ఇంకా నమ్ముతున్న నేతలకు ఇదే మా ఆహ్వానం. బీజేపీలో చేరండి. మా పార్టీ గంగానది లాంటిది. గంగానదిలో ఓ సారి మునకేస్తే పాపాలన్నీ తొలిగినట్టు  మా పార్టీలో చేరితో మీ పాపాలు తొలగిపోతాయి" 


- త్రిపుర సీఎం మాణిక్ సహా 


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు మాణిక్. బీజేపీ ట్రైన్‌లో కొన్ని బోగీలు ఖాళీగా ఉన్నాయని, ఎవరైనా ఎక్కొచ్చని అన్నారు. 


"బీజేపీ ట్రైన్‌లో కొన్ని కంపార్ట్‌మెంట్‌లు ఖాళీగా ఉన్నాయి. అందులో ఎక్కండి. ప్రధాని నరేంద్ర మోడీ మనల్నందరినీ తీసుకెళ్లాల్సిన చోటుకు తీసుకెళ్తారు"


- త్రిపుర సీఎం మాణిక్ సహా


త్రిపుర ప్రజల హక్కుల్ని కమ్యూనిస్ట్‌లు అణగదొక్కారని ఆరోపించారు. కమ్యూనిస్ట్‌ల పాలనలో ప్రజాస్వామ్యం అన్నదే లేదని విమర్శించారు. సౌత్ త్రిపుర జిల్లాలో 69 మంది ప్రతిపక్ష నేతలను చనిపోయారని...ఆ మరణాలకు కారణం కమ్యూనిస్ట్‌లేనని మండి పడ్డారు. కక్రబన్‌లో రాజకీయ హత్యలకు పాల్పడ్డారని అన్నారు. జనవరి 5వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జన్ విశ్వాస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీతో ప్రతిపక్ష నేతలందరూ కలిసి కట్టుగా వామపక్ష పార్టీలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 


ర్యాలీ ప్రారంభించిన అమిత్‌షా..


ఇటీవలే త్రిపురలో జన్ విశ్వాస్ ర్యాలీ ప్రారంభించారు...కేంద్రమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఆ రోజే ఆలయ ప్రారంభోత్సవం జరుపుకుంటామని స్పష్టం చేశారు. త్రిపురలోని ఓ సభలో పాల్గొన్న అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ పదేపదే అయోధ్య రామ మందిరం గురించి అపహాస్యం చేసే వారు. నిర్మాణం అక్కడే జరుగుతుంది కానీ..తేదీ మాత్రం చెప్పరు అని వెటకారం చేసేవారు. ఇప్పుడు చెబుతున్నా. రాహుల్ బాబా శ్రద్ధగా వినండి. చెవులు రిక్కించి వినండి. 2024 జనవరి 1వ తేదీ నాటికి రామ మందిరం తయారవుతుంది" అని వెల్లడించారు. త్రిపురలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అందుకే...ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ. ఇందులో భాగంగానే...అమిత్‌షా అక్కడ పర్యటించారు. CPIMపై విమర్శలు చేశారు. 






Also Read: Kanjhawala Accident: కార్ కింద చిక్కుకుందని తెలుసు, భయంతో లాక్కుంటూ వెళ్లిపోయాం - నేరం అంగీకరించిన నిందితులు