C Voter Survey on BJP Govt: 


సీ ఓటర్ సర్వే..


వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలు రెడీ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే రాజకీయ పరిణామాలూ మారిపోతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో వార్ వన్‌ సైడ్ అయిపోయి...బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. అయితే...ఈ సారి మాత్రం కాస్తో కూస్తో బీజేపీకి పోటీ తప్పదన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. రెండు మూడేళ్లలోనే రాజకీయాలు మార్పులు వచ్చాయి. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా...కాంగ్రెస్ కాస్త బలం పుంజుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రధాని అభ్యర్థికి పోటీగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ సీఎం నితీష్ కుమార్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని పదవికి గురి పెట్టారు. ఈ క్రమంలోనే  ఈసారి బీజేపీ విజయం నల్లేరుపై నడక కాదని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఓ సర్వే కూడా ఇదే విషయం చెబుతోంది. C-Voter, India Today సంయుక్తంగా చేపట్టిన సర్వే..."ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు పెడితే ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతారు" అనే అంశంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మోడీ సర్కార్‌పై ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. గత ఆరేళ్లలో మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసే వారి సంఖ్య 50% మేర పెరిగినట్టు ఈ సర్వేలో వెల్లడైంది. 18% మంది  మోడీ పాలనపై అసహనం వ్యక్తం చేసినట్టు పేర్కొంది. ఇదే సర్వే 2016లో చేపట్టగా...అప్పట్లో 12% మంది మోడీ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నారు. 2020లో కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్న వారి సంఖ్య 9%గా నమోదైంది. ఇప్పుడది 18%కి పెరిగింది.  


బీజేపీ సమీక్ష..


గతేడాది ఆగస్టులోనూ ఇదే సర్వే చేపట్టగా...దాదాపు 32% మంది అసహనం వ్యక్తం చేశారు. ఇక మోడీ పాలనకు మంచి మార్కులు ఇచ్చిన వారి సంఖ్య కూడా బాగానే ఉంది. దాదాపు 67% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని పదవిలో ఉండాలనుకున్న వారి సంఖ్య 52%గా ఉండగా...రాహుల్ గాంధీని ప్రధాని పదవిలో చూడాలనుకున్న వారు 14% మంది ఉన్నారు. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది బీజేపీ. స్వయంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా రంగంలోకి దిగి రాష్ట్రాల వారీగా పార్టీ బలాన్ని సమీక్షించు కుంటున్నారు. తరచూ సమావేశమవుతున్నారు. కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు పిలుపు నిస్తున్నారు. అయితే...బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్రను చెరిపేసుకోడానికి అధిష్ఠానం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మైనార్టీల వ్యతిరేక పార్టీ అనే అపవాదు తొలగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే...ముస్లింలతో సహా అన్ని మైనార్టీలకు దగ్గరయ్యే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు కార్యకర్తలకు కీలక ఆదేశాలిచ్చారు. అందరూ మైనార్టీలతో సంప్రదింపులు జరిపి వాళ్ల కష్టనష్టాలేంటో తెలుసుకోవాలని చెప్పారు. 
బీజేపీకి ఓటు వేస్తారా లేదా అన్నది పక్కన పెట్టి ఈ పని చేయాలని సూచించారు.