Bihar Politics:


క్లారిటీ ఇచ్చిన నితీష్..


బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు విషయమై మరోసారి స్పష్టతనిచ్చారు. చావడానికై సిద్ధం కానీ...బీజేపీతో కలిసి పోటీ చేసేది మాత్రం లేదని తేల్చి చెప్పారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు పట్నాకు వచ్చిన నితీష్‌పై మీడియా పలు ప్రశ్నలు సంధించింది. 


"ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. అసలు ఆ ప్రశ్నే వద్దు. చనిపోవడానికైనా వెనకాడం. కానీ...వాళ్లతో మాత్రం కలిసి ముందడుగు వేసేదే లేదు. అలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి. ఇలాంటి పుకార్లు ఎందుకు పుడుతున్నాయో తెలీదు" 


-నితీష్ కుమార్, బిహార్ సీఎం 


అటు బీజేపీ కూడా జేడీయూతో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని వెల్లడించింది. పొరపాటున కూడా అది జరగదని తేల్చి చెప్పింది. మైనార్టీ ఓటు బ్యాంకుపైనా నితీష్ కుమార్ స్పందించారు. బీజేపీ మాటల దాడి చేశారు. మైనార్టీల ఓట్లను బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని, కలిసి పోటీ చేసినప్పుడు తమ ఓటు బ్యాంకుతోనే కాషాయ పార్టీ గెలిచిందని వెల్లడించారు. వాజ్‌పేయీ, అడ్వాణి నాటి బీజేపీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఇప్పుడు ఆ పార్టీ రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. 


ఊహించని ప్రగతి..


బిహార్ ఊహించని ప్రగతిని సాధించిందని నితీష్ కుమార్ ఇటీవలే  ఓ కార్యక్రమంలో అన్నారు. తమ చిరకాల డిమాండ్ ప్రత్యేక హోదా తిరస్కరణకు గురైన తర్వాత కూడా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఉన్న వనరులతోనే అభివృద్ధి చేసుకుంటు న్నామన్నారు. వెనుకబడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఇచ్చే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రాల పురోగతి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రోద్యమంలో RSS పోరాటం చేయలేదని, దేశానికి స్వతంత్రం లభించడంలో ఆ సంస్థ చేసిన కృషి ఏమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవలే విమర్శించారు. "స్వాతంత్య్రోద్యమంలో వాళ్లు చేసిందేమీ లేదు. ఎప్పుడూ ఈ పోరాటంలో పాలు పంచుకోలేదు" అని అన్నారు. అంతే కాదు. ప్రధాని నరేంద్ర మోడీపైనా విమర్శలు చేశారు. "నవ భారత జాతి పిత" దేశానికి చేసిందేమీ లేదంటూ సెటైర్ వేశారు. "ఈ మధ్య కాలంలో నవ భారత జాతిపిత అని ఆయనను అందరూ పిలుస్తున్నారు. ఈ న్యూ ఫాదర్...న్యూ ఇండియాకు చేసిందేమీ  లేదు" అని అన్నారు.


ఇటీవల మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ ప్రధాని మోడీని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటూ పొగిడారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు నితీష్ కుమార్ సెటైర్ వేసింది కూడా ఈ కామెంట్స్‌పైనే. నితీష్ మాత్రమే కాదు. అటు కాంగ్రెస్ కూడా ఆమెపై తీవ్రంగానే విమర్శలు చేసింది. ప్రధాని మోడీని గాంధీతో పోల్చడం ఏంటని మండి పడింది. "జాతిపిత మహాత్మా గాంధీని 
ఎవరితోనూ పోల్చలేం. బీజేపీ చెబుతున్న నవ భారతం..కేవలం ధనికులకు మాత్రమే. మిగతా వాళ్లు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ఇలాంటి కొత్త భారత్ మనకు వద్దు. బడా బిజినెస్‌మేన్‌లున్న నవ భారత్‌కు మోడీని జాతిపిత చేసుకోవాలనుకుంటే చేసుకోండి. 
మేం అభినందనలు కూడా చెబుతాం" అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విమర్శించారు.