రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బలం వందకు చేరుకుంది. బీజేపీకి వంద మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.  గురువారం జరిగిన ఎన్నికల్లో అస్సాం, త్రిపుర, నాగాలాండ్‌లో ఒక్కో సీటును గెలుచుకోవడంతో బీజేపీ చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో 100 మంది సభ్యులను కలిగి ఉన్న ఘనత సాధించింది. ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు  ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో  పంజాబ్ నుండి ఉన్న ఒక్క రాజ్యసభ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. అయితే  ఈశాన్య రాష్ట్రాల నుంచి మూడు స్థానాలను పెంచుకుకున్నారు.  హిమాచల్ ప్రదేశ్‌లో ఒకటి గెలిచింది.   పంజాబ్‌లో మొత్తం ఐదు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో సాధించిన మూడు సీట్లను ప్రస్తుతమున్న 97కి కలిపితే బీజేపీ సంఖ్య 100కి చేరుకుంటుంది.


245 మంది సభ్యులతో కూడిన సభలో  బీజేపీకి మెజారిటీ లేదు.  2014లో రాజ్యసభలో బీజేపీ బలం 55 మాత్రమే. ఆ తర్వాత వరుసగా  అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంది.ఎగువ సభలో చివరిసారిగా 100 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు 1990లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఆ తర్వాత ఏ పార్టీకి వంద సీట్లు లభించలేదు. అప్పట్లో  కాంగ్రెస్‌కు 108 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. జూన్‌లో మరికొంత మంది రాజ్యసభ స్థానాల పదవి కాలం పూర్తవనుంది. వాటికి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 





మొత్తం 52 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలం తక్కువగా ఉంది. ఈ కారణంగా ఆ పార్టీకి సీట్లు లభించడం కష్టమే. ఇక ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఐదుగురు బీజేపీ రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం అక్కడ బలం తగ్గిపోవడంతో ఎంత మందిని మళ్లీ రాజ్యసభకు తెచ్చుకోగలరన్నది సందేహంగా మారింది.  అందుకే ఇప్పుడు ఉన్న వంద రాజ్యసభ సీట్ల గుర్తింపు జూన్ తర్వాత ఉంటుందా ఉండదా అన్నదిచెప్పడం కష్టమే. బీజేపీకి మాత్రమే కాకుండా బీజేపీ మిత్రపక్షాలకు కూడా సభ్యులు ఉన్నారు.ఈ కారణంగా రాజ్యసభలోనూ బీజేపీ పట్టు సాధిస్తోందని అనుకోవచ్చు.