BJP Vs AAP: 


విచారణ చేయాల్సిందే..


ఢిల్లీ వేదికగా భాజపా, ఆప్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. కావాలనే తమను టార్గెట్ చేశారని ఆప్ మండి పడుతుంటే...ఆప్ ఓ అవినీతి పార్టీ అంటూ భాజపా రివర్స్ కౌంటర్ ఇస్తోంది. భాజపా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు ఆడుతోందంటూ ఆప్ ఇప్పటికే ఆరోపణలు చేసింది. దీనిపై భాజపా మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి "ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్" జరపాలంటూ డిమాండ్ చేస్తోంది. ఆప్ చేస్తున్న ఆరోపణలపై ఈ తరహా విచారణ జరపాల్సిన అవసరముందని...భాజపా ఎంపీలు మనోజ్ తివారి, రమేశ్ బిదురి, హన్స్‌రాజ్ హన్స్, పర్వేశ్ వర్మ ఈ డిమాండ్ చేశారు. "యాంటీ కరెప్షన్" పార్టీ అంటూ ఆప్‌ డ్రామాలు చేస్తోందని మండి పడ్డారు. విచారణ చేస్తేనే ఆప్‌ బండారం బయట పడుతుందని డిమాండ్ చేస్తున్నారు. "భాజపా తమ ఎమ్మెల్యేలకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసినట్టు ఆప్ ఆరోపిస్తోంది. దీనిపై ఫోరెన్సిక్ విచారణ అవసరం. వాళ్లకు ఎవరు కాల్ చేశారో వాళ్ల పేర్లు ఎందుకు చెప్పటం లేదు..? అలా ఆఫర్ చేసిన వాళ్లపై ఇప్పటి వరకూ లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు?" అని భాజపా ఎంపీ మనోజ్ తివారీ ప్రశ్నించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై ఆప్...మాటి మాటికీ మాట మార్చుతోందని విమర్శించారు. 










ఇదో కొత్త నాటకం: భాజపా ఎంపీలు


మరో భాజపా ఎంపీ పర్వేశ్ వర్మ "లై డిటెక్టర్ టెస్ట్" చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆప్ నిజ స్వరూపం తెలియాలంటే...ఇలా చేయాల్సిందేనని అన్నారు. సీఎం కేజ్రీవాల్, డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు. ఈ మేరకు 7గురు భాజపా ఎంపీలు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. ఆప్‌ చేస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆప్ చేస్తున్న ఆరోపణలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, కేవలం ఎక్సైజ్ పాలసీ అవినీతి విషయాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ కొత్త నాటకం తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. తమ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను భాజపా తనవైపు లాక్కునేందుకు బేరమాడుతోందని ఆమ్‌ ఆద్మీ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇస్తామని డీల్ మాట్లాడినట్టు విమర్శించింది. మొత్తం 40 మంది ఎమ్మెల్యేలకు రూ.800 కోట్లు ఇచ్చేందుకు భాజపా ఆశ చూపించిందని...ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంత బ్లాక్ మనీ...భాజపాకు ఎక్కడి నుంచి వస్తోందో అంటూ ప్రశ్నించారు. 


మెసేజ్‌లు వస్తున్నాయి: ఆప్ 


"మా ఎమ్మెల్యేలను భాజపా సంప్రదిస్తోంది. మాకు మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఎవరు ఈ పని చేస్తున్నారన్నది ఇంకా తేలలేదు. మా మీటింగ్‌కు ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు" అని ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే గతంలో భేటీ అయిన సమయంలో ఆరోపించారు. మరో ఎమ్మెల్యే అతీషి కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. "మా ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేస్తున్నారు. కొందర్ని బెదిరిస్తున్నారు. డిప్యుటీ సీఎం కూడా బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఇప్పుడే కాదు. గతంలోనూ భాజపా ఇక్కడ ఆపరేషన్ లోటస్‌ను చేపట్టింది. అప్పుడు ఫెయిల్ అయ్యారు. ఎప్పుడూ ఇలా ఫెయిల్ అవుతూనే ఉంటారు" అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన తరుణంలో ఈ ఆరోపణలు రావటం సంచలనమైంది. అయితే...సమావేశం జరిగిన తరవాత ఆప్ స్పందించింది. భాజపా ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయిందని...62 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది మీటింగ్‌కు వచ్చారని వెల్లడించింది. మిగతా ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఫోన్‌లో మాట్లాడారని స్పష్టం చేసింది. శుక్రవారం అసెంబ్లీలో స్పెషల్ సెషన్‌ నిర్వహించాలని ఆప్ నిర్ణయించింది. దీనిపైనే చర్చించేందుకు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు  చేశారు కేజ్రీవాల్. 


Also Read: Mikhail Gorbachev Death: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు మృతి, సంతాపం తెలిపిన పుతిన్