Mikhail Gorbachev Death:



ప్రచ్ఛన్న యుద్దం ముగించటంలో కీలక పాత్ర..


సోవియట్ యూనియన్‌కు చెందిన చివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ మృతి చెందారు. 91 ఏళ్ల గోర్బచెవ్ అనారోగ్యంతో చనిపోయినట్టు మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్ ప్రకటించింది. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఘర్షణలను తగ్గించటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రక్తపాతం లేకుండా ప్రశాంతంగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించేందుకు చొరవ చూపారు. సోవియట్ యూనియన్ చివరి అధినేతగా...ఆ యూనియన్‌లో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. నిజానికి..సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం చేయాలన్న ఆయన ప్రయత్నించినా అది ఫలించలేదు. అందుకే... నిరంకుశత్వాన్ని కాదని క్రమంగా మార్పులు తీసుకొచ్చారు. కానీ...కమ్యూనిస్ట్ పార్టీలో ఇలాంటి సంస్కరణలు చేయటమేంటని అప్పట్లో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. అయినా..వాటిని పట్టించుకోకుండా మార్పులకు శ్రీకారం చుట్టారు గోర్బచెవ్. అమెరికాతో సత్సంబంధాలు పెంచుకోవటంలోనూ చొరవ చూపించారు. అలాగే పాశ్చాత్య దేశాలతోనూ మైత్రిని కొనసాగించారు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా రెండుగా విడిపోయినా...ఆ తెరలను తొలగించేందుకు గట్టిగానే కృషి చేశారు. 
 
నోబెల్ పురస్కారం..


1999లో గోర్బచెవ్ సతీమణి రైసా కన్నుమూశారు. ఆమె సమాధి పక్కనే గోర్బచెవ్‌నూ ఖననం చేయనున్నారు. 1985 నుంచి 1991 వరకూ సోవియట్ యూనియన్‌ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు మిఖాయిల్ గోర్బచెవ్. మధ్యలో 1990-91 వరకూ సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగానూ ఉన్నారు. 1989లో ఈస్టర్న్ యూరప్‌లో సోవియట్ యూనియన్ నియంతృత్వాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ సమయంలో సైన్యాన్ని పెద్దగా వినియోగించలేదు. మొదట్లో గోర్బచెవ్ కూడా మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాల ప్రభావం ఆయనపై బాగా ఉండేది. తరవాత సోషల్ డెమొక్రసీ ఎంతో ముఖ్యమంటూ నినదించారు. అందుకు అనుగుణంగా యూనియన్‌లో సంస్కరణలు చేపట్టారు. అయితే...1991లో సోవియట్ యూనియన్ పతనమయ్యాక...ఆయన రాజకీయ ప్రస్థానం ఉన్నట్టుండి ఆగిపోయింది. 1996లో మరోసారి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసినా..అవి ఫలించలేదు. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనగా..కేవలం 1% ఓట్లు మాత్రమే సాధించగలిగారు. సోవియట్ యూనియన్ పతనానికి ముందు ఆయన తూర్పు, పశ్చిమ దేశాల మధ్య సాన్నిహిత్యం పెంచటంలో చాలా చొరవ చూపారు. ఈ సేవలకు గానూ...1990లో నోబెల్ పురస్కారం కూడా ఆయనను వరించింది. ఆయన మృతి పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం ప్రకటించారు. అటు యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా గోర్బచెవ్ చిత్తశుద్ధిని కొనియాడుతూ సంతాపం తెలిపారు.