Bihar Political Crisis: బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారిపోయింది. మిత్రపక్షం భాజపాకు ఝలక్ ఇచ్చి మరోసారి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ)తో నితీశ్ కుమార్ జత కట్టారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ), కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమితో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ జట్టు కట్టింది. ఆ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు నితీశ్.
రబ్రీ దేవి నివాసానికి
పట్నాలో గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలిసి మంగళవారం రాజీనామా లేఖ అందజేశారు నితీశ్ కుమార్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి ఏకగ్రీవ సూచన మేరకు ఇలా చేసినట్లు మీడియాతో చెప్పారు.
అనంతరం రాజ్‌భవన్ నుంచి నేరుగా రబ్రీ దేవి నివాసానికి వెళ్లారు నితీశ్ కుమార్. తేజస్వీ యాదవ్ సహా ఇతర ఆర్‌జేడీ నేతల్ని ఆయన కలిశారు. "2017లో ఏం జరిగిందో మర్చిపోదాం. ఇప్పుడు సరికొత్త అధ్యాయం ప్రారంభిద్దాం" అని ఆయన తేజస్వీ యాదవ్‌తో అన్నట్లు సమాచారం.
మళ్లీ గవర్నర్ వద్దకు
ఆ తర్వాత కాసేపటికి నితీశ్, తేజస్వీ కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. తమకు సంఖ్యాబలం ఉందని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన పత్రాల్ని సమర్పించారు.
అంతకుముందు
జేడీయూ శాసనసభ్యులు, ముఖ్య నేతలతో నితీశ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నితీశ్ కుమార్.. భాజపాతో దోస్తీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారట. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము నితీశ్ కుమార్ వెంటే ఉంటామని.. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇలా
చాలా కాలం నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్‌డీఏ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2020 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి నితీశ్ అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షం భాజపాకి ఎక్కువ సీట్లు దక్కాయి. దీంతో నితీశ్‌పై ఆ పార్టీ పెత్తనం చెలాయిస్తుందనే ప్రచారం సాగింది. ఈ కారణంగా పలుమార్లు నితీశ్ కుమార్ అసహనానికి గురయ్యారు. దీంతో నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
బలాబలాలు
బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. అతిపెద్ద పార్టీ ఆర్‌జేడీకి అసెంబ్లీలో 80 స్థానాలు ఉన్నాయి. భాజపా 77, జేడీయూ 45, కాంగ్రెస్ 19 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read: India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!
Also Read: Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు