Bihar Hooch Tragedy:


మద్యం తాగితే చనిపోతారు: నితీష్ 


బిహార్‌లో చప్రా, సివాన్‌ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో బీజేపీ, నితీష్ మధ్య వాగ్వాదమూ కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ మరణాలన్నీ...అంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. అటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా గట్టిగానే బదులిస్తున్నారు.  మద్య నిషేధం పకడ్బందీగా అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "మద్యం సేవించిన వాళ్లెవరైనా సరే ఇలాగే ప్రాణాలు కోల్పోతారు. మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున పరిహారం కూడా ఇవ్వం. మేం ఎప్పటి నుంచో ఇదేచెబుతున్నాం. మద్యపానం గురించి సానుకూలంగా మాట్లాడే వాళ్లతో మీకు కలిగే ప్రయోజనమేమీ లేదు" అని అన్నారు. అసెంబ్లీ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందే మీడియాతో మాట్లాడిన సమయంలో "కల్తీ మద్యం సేవించిన వారెవరైనా ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటారు"
అని తేల్చి చెప్పారు నితీష్ కుమార్. మద్య నిషేధం పథకం వల్ల చాలా మంది ఆ వ్యసనం నుంచి బయటపడ్డారని మరోసారి స్పష్టం చేశారు. చప్రా ఘటనలో మృతుల సంఖ్య 50 కి పెరిగింది. సరాన్ జిల్లాలోనూ 11 మంది కల్తీ మద్యం సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2016 ఏప్రిల్ నుంచే బిహార్‌లో మద్య నిషేధం అమలవుతోంది. 






మరో జిల్లాలోనూ ఇదే ఘటన..


బిహార్‌లో చప్రా ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వాదనలు జరుగుతున్న సమయంలోనే మరోసారి అలాంటి సంఘటనే జరిగింది. ఈ సారి సివాన్ జిల్లాలో ఐదుగురు కల్తీ లిక్కర్‌కి బలి అయ్యారు. ఈ ఐదుగురిలో ఓ వాచ్‌మెన్ కూడా ఉన్నాడు. ఈ మరణాలతో బ్రహ్మస్థాన్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చప్రాకు పక్కనే ఉన్న సివాన్‌లో ఈ తరహా మరణాలు నమోదవడం మరింత సంచలనమైంది. కల్తీ మద్యం సేవించిన తరవాత ఉన్నట్టుండి వాళ్ల ఆరోగ్యం పాడైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా...చికిత్స జరుగుతుండగానే మరణించారు. గ్రామంలో విక్రయిస్తున్న మద్యాన్ని సేవించడం వల్లేఇలా జరిగిందని మృతులు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మద్యం సేవించి వచ్చిన రాత్రి బాగానే ఉన్నారని...తెల్లవారాక చూపు కోల్పోయారని ఆ తరవాత తలనొప్పి తీవ్రమైందని వివరించారు. ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయిందని చెప్పారు. "మద్యం మానేసి సాధారణ జీవితం గడుపుతున్న వాళ్లెందరో ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఘటనను మాత్రం అసలు ఉపేక్షించం. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారెవరైనా సరే వారిని పట్టుకుంటాం. కఠినంగా శిక్షిస్తాం" అని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. 


Also Read: 10 Years Of Nirbhaya Case: నిర్భయ ఘటనకు పదేళ్లు, మహిళా భద్రతలో ఏమైనా మార్పు వచ్చిందా?