ED Notice To Rohit Reddy :  టాలీవుడ్ డ్రగ్స్ కేసులో   టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. రోహిత్ రెడ్డితో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ 19వ తేదీనే హాజరు కానున్నారు. 


ఆధారాల కోసం హైకోర్టుకు వెళ్లి మరీ తీసుకున్న ఈడీ 


టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ గత ఏడాది విచారణ జరిపింది. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సైలెంట్ అయింది. అయితే పూర్తిగా కేసును విత్ డ్రా చేసుకోలేదు. తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలివ్వలేదని.. కోర్టుకు వెళ్లి.. ఆధారాల కోసం న్యాయపోరాటం చేశారు.  హైకోర్టు పదే పదే ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత  ఈడీకి అధారాలు ఇచ్చారు.  ఈడీ అధికారులకు ఇచ్చిన సమాచారంలో..కోర్టుకు సమర్పించని కీలకమైన వాంగ్మూలాలు ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిని పరిశీలించి టాలీవుడ్ డ్రగ్స్ నిందితులకు ఈడీ ప్రత్యేకంగా నోటీసులు జారీ అవకాశాలు ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. చాలా రోజుల ఆలస్యం తర్వాత ఇప్పుడు నోటీసులు జారీ చేయడం అనూహ్యంగా మారింది. 


గతంలో టాలీవుడ్ ప్రముఖుల్ని ఈడీ ప్రశ్నించినా వెలుగులోకి రాని విషయాలు 


టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల్ని ఇప్పటికే   ఈడీ అధికారులు ఓ సారి ప్రశ్నించారు. కానీ అప్పుడు వారికిఎలాంటి ఆధారాలు దొరకలేదు. అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు కూడా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.  దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చారు. నిజానికి ఈడీ దర్యాప్తు చేసేది డ్రగ్స్ వాడారా లేదాఅనేది కాదు… డ్రగ్స్ కోసం చెల్లింపులు ఎలా చేశారన్నదానపైనే. అక్రమ నగదు లావాదేవీల కోణంలోనే ఈ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలా డబ్బులు చెల్లించిన విషయం బయటకు వస్తే.. నిజంగానే వారు డ్రగ్స్ కొన్నట్లుగా తేలిపోతుంది. అదే జరిగితో మరో రకంగా ఇరుక్కుంటారు. అంటే.. అన్ని విధాలుగా కేసుల్లోకి వెళ్లిపోతారు. ఈడీ విచారణలో ఎవరైనా పొరపాటున డ్రగ్స్ కోసం డబ్బులు చెల్లించినట్లుగా బయటపడితే… ఇక చిక్కులు తప్పనట్లే. ఆ ఒక్కలింక్ నుంచి మొత్తం ఈడీ బయటకు లాగే అవకాశం ఉంది. ఎలా చూసినా టాలీవుడ్‌ను మళ్లీ డ్రగ్స్ కేసు వెంటపడటం ఖాయంగా కనిపిస్తోంది.


పైలట్ రోహిత్ రెడ్డిని టార్గెట్ చేసే మళ్లీ విచారణ ప్రారంభమయిందా ? 


అయితే ఇక్కడ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇంత వరకూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు బయటకు రాలేదు. హీరోయిన్ రకుల్ ప్రతీ సింగ్ ను గతంలో ఓ సారి విచారించారు కానీ పైలట్ రోహిత్ రెడ్డి పేరు మాత్రం మొదటి సారి వెలుగులోకి వచ్చింది. ఈడీ కూడా నోటీసులు జారీ చేయడంతో ప్రాథమిక ఆధారాలు ఉంటాయని భావిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్ .. డ్రగ్స్ కేసుల గురించి ప్రస్తావిస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసుల్లో ఉన్నారని.. వదిలి పెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమయింది. ఫామ్ హౌస్ కేసు ద్వారా బీజేపీని పైలట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్న ఆగ్రహం ఆ పార్టీ నేతల్లో ఉంది . బెంగళూరు డ్రగ్స్ కేసుల్లోనూ రోహిత్ రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలు బీజేపీ చేస్తోంది. ఈ క్రమంలో  ఆ కేసులోనూ ఏమైనా నోటీసులు రోహిత్ రెడ్డికి వస్తాయేమో చూడాల్సి ఉంది.