10 Years Of Nirbhaya Case:


దేశమంతా ఉలిక్కిపడింది..


సరిగ్గా పదేళ్ల క్రితం దేశమంతా ఉలిక్కిపడ్డ సంఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో నగరం నడిబొడ్డున కదులుతున్న బస్సులోనే అత్యంత దారుణంగా ఓ యువతి అత్యాచారానికి గురైంది. చెప్పుకోడానికి కూడా వీల్లేనంత దారుణంగా హింసించారు. దుస్తులన్నీ తొలగించి రోడ్డుపక్క పొదల్లో పడేశారు. పోలీసులు గుర్తించి ఆసుపత్రిలో చేర్చాక కానీ...ఆ యువతి ఎంత నరకం అనుభవించిందో ప్రపంచానికి తెలియలేదు. ఆ యువతికి ఎలా చికిత్స అందించాలో కూడా అర్థంకాక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు వైద్యులు. చివరకు చికిత్స పొందుతూనే మృతి చెందింది. 2012 డిసెంబర్ 16న ఈ అత్యాచారం జరిగింది. పదేళ్లైనా ఇప్పటికీ ఢిల్లీ ప్రజలకు మరిచిపోలేని పీడకలగా మిగిలిపోయింది. కూతుళ్లున్న తల్లిదండ్రులందరూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడపాల్సినదుస్థితికి తీసుకొచ్చింది ఆ ఒక్క సంఘటన. ఇప్పటికీ ఢిల్లీలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఓ 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి చేశారు కొందరు దుండగులు. నిర్భయ ఘటనన తలుచుకుని బాధితురాలి తల్లిదండ్రులు ఇప్పటికీ వణికిపోతున్నారు. ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పట్లో బయటపడలేమని చెబుతున్నారు. "ఈ పదేళ్లలో ఒక్క నిర్భయ ఘటనలో తప్ప మరే బాధితురాలికి న్యాయం జరగలేదు. సమాజంలో ఏ మార్పూ రాలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఎలాంటి భయంలేకుండా అలాంటి దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారని అన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు. రోజువారీ చర్చలను పక్కన పెట్టి పూర్తిగా నిర్భయ ఘటనపై, మహిళా భద్రతపై చర్చించాలని కోరారు. "మహిళలు, బాలికల పట్ల ఇంకా లైంగిక దాడులు ఆగనే లేదు. ఈ విషయంలో ప్రభుత్వాల వైఫల్యం  స్పష్టంగా కనిపిస్తోంది. నిర్భయ ఫండ్ కింద బాధితులకు అందించే పరిహారం కూడా తగ్గించేశారు" అని లేఖలో పేర్కొన్నారు స్వాతి మలివాల్.  


నలుగురికి ఉరిశిక్ష


ఈ కేసులో ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్. ఆ బాలుడిని జువైనల్‌ జైల్‌కు తరలించి మూడేళ్ల పాటు శిక్ష విధించారు. 2015లో విడుదల చేశారు. నలుగురు దోషులను 2020 మార్చి 20న ఉరి తీశారు. రామ్‌ సింగ్ అనే దోషి మాత్రం తీహార్ జైల్లో ఉండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అప్పటికప్పుడు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. మాజీ సీజేఐ జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలో వర్మ కమిటీ ఏర్పాటైంది. అత్యాచార కేసుల్లో నిందితులకు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష విధించాలన్న నిబంధననుపూర్తిగా రద్దు చేశారు. అంత కన్నా ఎక్కువ శిక్ష విధించేలా మార్పులు చేశారు. పదేపదే అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించేలా మార్పులు చేశారు. అత్యారాలకు పాల్పడే వారికి భారీ జరిమానాలతో పాటు కఠిన శిక్షలూ విధించేలా ప్రభుత్వం చొరవ చూపింది.


Also Read: Bihar Hooch Tradegy: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం కలకలం, ఐదుగురు మృతి