Nitish Kumar Delhi Visit 


ప్రతిపక్షాలతో భేటీ


బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నితీష్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కీలక ప్రతిపక్ష నేతలతో ఆయన భేటీ కానున్నారు. భిన్నపార్టీలకు చెందిన లీడర్స్‌ ఈ భేటీకి హాజరవుతారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు నితీష్. సీనియర్ కాంగ్రెస్ నేతలనూ కలవనున్నారు. భాజపాతో తెగదెంపులు చేసుకున్న వెంటనే...రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో నితీష్ సంప్రదింపులు జరిపారు. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన ఆయన...ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం కేజ్రీవాల్‌తోనూ భేటీ కానున్నారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలానూ కలవనున్నారు. లోక్‌దళ్ పార్టీలో ఉన్నప్పటి నుంచి నితీష్‌కు, ఓం ప్రకాశ్‌కు సాన్నిహిత్యం ఉంది. అయితే...జేడీయూ సెక్రటరీ జనరల్ కేసీ త్యాగి మాత్రం ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఇటీవలే మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల తరవాత..."2024 ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేయట్లేదు" అని స్పష్టతనిచ్చారు. అటు నితీష్ కూడా ప్రధాని అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇచ్చారు. కేవలం భాజపాయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.  


ప్రతిపక్షాలన్నీ ఒక్కటైతే...భాజపా ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతానికి మొత్తం 7 పార్టీల మద్దతు ఉందని, మరో నాలుగు పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతినీ కలుస్తానని వివరించారు. నితీష్ ఢిల్లీ పర్యటనపై జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్‌ మాట్లాడారు. "ఢిల్లీలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకే నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ ఓటర్లలో 38% మంది భాజపాకు వ్యతిరేకంగా ఉన్నారు" అని అన్నారు. 
 
భాజపా కౌంటర్‌లు


2024లో ప్రధాని పదవికి నితీష్ కుమార్ పోటీ పడతారన్న వార్తల నేపథ్యంలో...భాజపా నేత అమిత్ మాల్వియా సెటైర్లు వేశారు. "సీఎంగానే విఫలమైన వ్యక్తి ప్రధాని పదవి కోసం చూస్తుండటమేంటో. రాష్ట్రంలో ఆయన పార్టీ ఎప్పుడో అప్పుడో కుప్ప కూలిపోక తప్పదు" అని విమర్శించారు. ట్విటర్ వేదికగా కౌంటర్‌లు వేశారు. "పశ్చిమ బెంగాల్‌ను దాటి ప్రజల నమ్మకాన్ని పొందాలని ప్రయత్నించిన మమతా బెనర్జీ విఫలమయ్యారు. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా అదే చేస్తున్నారు. సీఎంగానే విఫలమైన వ్యక్తి...సొంత పార్టీ మునిగిపోతుంటే...ప్రధాని పదవి కోసం ఆరాటపడుతున్నారు" అని ట్వీట్ చేశారు. ఇటీవలే నితీష్ కుమార్ భాజపా నేతృత్వంలోని NDA నుంచి బయటకు వచ్చేశారు.ఆర్‌జేడీతో జోడీ కట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయటమే కాకుండా...ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడ్డాకే... నితీష్ 2024లో ప్రధాని పదవికి పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తల్ని నితీష్ కొట్టి పారేస్తున్నప్పటికీ...ఆ చర్చ మాత్రం జోరుగానే సాగుతోంది. 


Also Read: Munugodu Bypoll: మునుగోడులో అన్నదమ్ముల సవాల్‌ ఉంటుందా? కోమటిరెడ్డి బ్రదర్స్‌ స్ట్రాటజీ ఏంటి?


Also Read: Minister Harish Rao : మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఆయన ఫొటో పెట్టారా? - మంత్రి హరీశ్ రావు