నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రి పదవిని తృణ ప్రాయంగా త్యజించిన కోమటిరెడ్డి వెంకట రెడ్డికి నల్గొండలోనే కాకుండా తెలంగాణలోనూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇప్పుడు సోదరుడు పార్టీ మారినప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండటం.. మరోవైపు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే మునుగోడు ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు స్పష్టంగా తన వైఖరి చెప్పకపోవడం చూస్తే అసలు నల్గొండ రాజకీయాలను శాసించిన వెంకన్న ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తర్వాత వైఎస్సార్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన ఆయన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని త్యజించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో 2018లో నల్గొండ నుంచి ఓటమి పాలైనప్పటికీ భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రాకపోవడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కొంత మైనస్‌గా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో తాను నెంబర్‌వన్ అవుతానని ఊహించినప్పటికి అది మాత్రం సాధ్యం కాలేదు.
సోదరుడి వ్యవహార శైలే వెంకన్నకు శాపమా..?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాజగోపాల్‌రెడ్డి 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఇద్దరు సొదరులు నల్గొండ రాజకీయాలను శాసించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ వెంకటరెడ్డి మాత్రం నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే గత మూడేళ్ల నుంచి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారశైలి అటు కాంగ్రెస్‌లోనూ ఇటు తెలంగాణలోనూ చర్చానీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ బద్ద శత్రువు అయిన బీజేపీని పొగడ్తలతో ముంచడం, తాను బీజేపీలోకి వెళ్తానని చెప్పకనే చెప్పుతుండటంతో వెంకటరెడ్డి పీసీసీ అద్యక్ష రేసు నుంచి పక్కకు పోయేందుకు సహకరించాయని అన్నారు. మరోవైపు ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా సైతం వెంకటరెడ్డి ఆయనతోపాటు డిల్లీలో బీజేపీ నేతలకు టచ్‌లో ఉండటంతో ఇద్దరు సోదరులు బీజేపీలోకి వెళ్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారినప్పటికీ వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండటం, తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల వైపు చూడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అక్కడ ఓకే.. ఇక్కడ ఏంటి..?
రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసింది. అయితే ఈ సభలో రేవంత్ రెడ్డితోపాటు మిగిలిన నేతలు హాజరైనప్పటికీ కోమటిరెడ్డి మాత్రం దూరంగానే ఉన్నారు. ఈ సభలో కొందరు చేసిన వ్యాఖ్యలపై మాత్రం స్పందించారు. అయితే ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రియాంకగాం«ధీతో వెంకటరెడ్డి బేటి కావడం, ఆ తర్వాత రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నిరసన సభలో వెంకటరెడ్డి పాల్గొనడంతో ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో వెంకటరెడ్డి ఏం చేయబోతున్నాడనే విషయంపై చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో తన ప్రాబవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల కీలకంగా మారడం, సోదరుడు బీజేపీలోకి వెళ్లినప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటున్న వెంకటరెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తారా..? లేక సొంత పార్టీకి న్యాయం చేస్తారా..? అనే విషయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. మరి సోదరుడి విషయంలో వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది వేచి చూడాల్సిందే.