Minister Harish Rao : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి అసంబద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఆయన ఫొటో పెట్టారా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఉపయోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని కేంద్ర మంత్రి మాట్లాడటంలో ఔచిత్యం లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  ప్రధాని మన్మోహన్ సింగ్ ఫొటో పెట్టారా అని నిలదీశారు. ప్రజా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై ప్రధాని ఫొటో పెట్టాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు.   


బీజేపీ పాచిక పారదు


తెలంగాణకు వచ్చి మూడు విమర్శలు, ఆరు అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేస్తామంటే ఇక్కడి తెలంగాణ సమాజం ఊరుకోదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో బీజేపీ పాచిక పారదన్నారు. తెలంగాణ  ప్రజలను అవాస్తవాలతో మభ్యపెట్టలేరన్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు.  ఇలాంటి కుట్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని కేంద్ర మంత్రులకు సూచించారు.  కేంద్ర ప్రభుత్వం అనవసరం పథకాలు పెడుతూ రాష్ట్రాల వాటా పెంచి భారం వేస్తుందని ఆరోపించారు.  పనికి ఆహారపథకం లాంటి మంచి పథకాలకు కొర్రీలు వేస్తూ, నిధులు తగ్గించారన్నారు. 


ముఖ్యమంత్రుల సిఫార్సులు ఏమయ్యాయి? 


పథకాల పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం సమాఖ్య వ్యవస్థ తూట్లు పొడుతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.  నీతి ఆయోగ్‌ నియమించిన ముఖ్యమంత్రుల ఉపసంఘం సిఫార్సులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. సీఎంల ఉపసంఘం అధ్యయనం చేసి ఇచ్చిన సిఫార్సులు కేంద్రానికి ఎందుకు నచ్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమైన సమస్యలు ఎన్ని ఉన్న వాటిని వదిలేసి ఫొటోల కోసం రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రులకు ప్రజల అవసరాలు తీర్చాలా? ప్రచార ఆర్భాటాలు కావాలా? అని మంత్రి హరీశ్‌రావు లేఖలో ప్రశ్నించారు. 


మంత్రి కేటీఆర్ ఫైర్


 తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రం చేసిన అప్పులపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ ట్వీట్ చేశారు. 2014 ముందు 67ఏళ్ల  స్వతంత్ర దేశంలో 14 మంది ప్రధానులు మారినా దేశం అప్పు రూ.56 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. కానీ బీజేపీ అధికారం చేపట్టిన గత ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్లకు అప్పు పెరిగిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం వల్ల ప్రతి భారతీయుడిపై రూ.1.25 లక్షల అప్పు ఉందన్నారు. ఆర్థిక విషయాలపై అనర్గళంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రం అప్పులపై మాట్లాడాలన్నారు.   2022లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అయితే జాతీయ తలసరి ఆదాయం కేవలం రూ.1.49 లక్షలుగా ఉందన్నారు.  తెలంగాణ జీఎస్‌డీపీ కేవలం 23.5 శాతంగా ఉందన్నారు. దేశ జనాభాలో 2.5 శాతంగా ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో ఐదు శాతం వాటా కలిగి ఉందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలు తెలంగాణ కన్న మెరుగ్గా పనిచేస్తే భారత్‌ 4.6 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమికి ఎదిగేదని కేటీఆర్‌ చురకలు అంటించారు. తెలంగాణ పన్నుల ద్వారా కేంద్రానికి ఇస్తున్న ప్రతీ రూపాయిలో కేవలం రూ.0.46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఆరోపించారు. మిగిలిన డబ్బులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని, ఆ రాష్ట్రాల్లోని పీడీఎస్ షాపుల వద్ద థ్యాంక్స్ టు తెలంగాణ అనే బోర్డులు పెడతారా? అని నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. 


Also Read : Minister KTR : మోదీ ప్రభుత్వం వల్ల ప్రతి పౌరుడిపై రూ.1.25 లక్షల అప్పు, కేంద్రం అప్పులపై మంత్రి కేటీఆర్ ట్వీట్


Also Read : Revanth Reddy: చదువు చెప్పమంటే చంపుతున్నారు, కేసీఆర్ కక్ష కట్టారు: రేవంత్ రెడ్డి