Import Tax on EV's:


పన్ను తగ్గేదే లేదు..


భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా (Tesla in India Market) ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. భారత్‌ కూడా అందుకు సానుకూలంగానే ఉన్నప్పటికీ Import Tax విషయంలో రాజీ కుదరడం లేదు. ఈ ట్యాక్స్‌ని తగ్గించాలని టెస్లా ప్రతిపాదించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చాలా రోజులుగా దీనిపై చర్చ జరిగింది. ఇన్నాళ్లకు అధికారికంగా ఓ ప్రకటన చేసింది. దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై ఇంపోర్ట్ ట్యాక్స్ (Import Tax on Tesla Vehicles)తగ్గించే ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇండియన్ మార్కెట్‌లో పాగా వేయాలని చూస్తున్న టెస్లాకి ఇది ఊహించని షాక్. పార్లమెంట్‌లో ఈ ప్రస్తావన రాగా..లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు వాణిజ్యశాఖ మంత్రి సోమ్ ప్రకాశ్. దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై వేసే ట్యాక్స్ విషయంలో ఎలాంటి సబ్సిడీలు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 


"దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై దిగుమతి పన్నులో సబ్సిడీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లోకల్ వాల్యూ అడిషన్‌కే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే GST అమల్లోకి తీసుకొచ్చింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్ని సవరించింది"


- సోమ్ ప్రకాశ్, వాణిజ్య మంత్రి


కొలిక్కి రాని చర్చలు..


ఆటోమొబైల్ ఇండస్ట్రీని మరింత బలోపేతం చేసేందుకు Production Linked Incentive (PLI) స్కీమ్‌ని కూడా అమల్లోకి తీసుకొచ్చినట్టు వివరించారు సోమ్ ప్రకాశ్. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని పెద్ద ఎత్తున విక్రయించాలని చూస్తున్న టెస్లా ఇకపై భారత్‌ మార్కెట్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. కొద్ది నెలలుగా టెస్లా ప్రతినిధులు భారత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ ఈ చర్చలు కొలిక్కి రాలేదు. భారత్‌లోనే టెస్లా కార్‌లను తయారు చేయాలని ప్రతిపాదించింది కేంద్రం. కానీ అందుకు టెస్లా అంగీకరించడం లేదు. 


భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్‌తో భేటీ అయ్యారు. టెస్లా అందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ ఓ విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే ఓ కండీషన్‌ పెట్టింది. ఫ్యాక్టరీ పెట్టిన రెండేళ్ల పాటు తమ వాహనాలపై దిగుమతి సుంకాన్ని 15%కి తగ్గించాలని అడుగుతోంది. ఇదే జరిగితే ఇండియాలో 2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇంతకుముందు టెస్లా పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలని కోరింది. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు ప్రస్తుతం 60 శాతం, అంతకంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు 100 శాతం దిగుమతి సుంకం అందుబాటులో ఉంది. 


Also Read: నెలసరి సెలవులు ఇచ్చే ఆలోచనే లేదు, అదేం వైకల్యం కాదు - తేల్చి చెప్పిన స్మృతి ఇరానీ