Security Breach in Lok Sabha: 


ఆ లూప్‌హోల్ పట్టుకుని..


లోక్‌సభ దాడి నిందితుల (Security Breach Lok Sabha) విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అంత సులువుగా విజిటర్స్ భద్రతను తప్పించుకుని కలర్ టియర్ గ్యాస్‌ క్యానిస్టర్‌లను లోపలికి ఎలా తీసుకెళ్లారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిందితుడు మనోరంజన్ ఆశ్చర్యపోయే విషయాలు చెప్పాడు. సెక్యూరిటీలో ఉన్న ఓ చిన్న లోపాన్ని కనిపెట్టి లోపలికి దూసుకెళ్లినట్టు పోలీసులకు వివరించాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...పాత పార్లమెంట్ బిల్డింగ్‌లో బడ్జెట్ సమావేశాలు జరిగిన సమయంలోనే మనోరంజన్‌ (Manoranjan) హాజరయ్యాడు. ఆ సమయంలో పరిసర ప్రాంతాలను పరిశీలించాడు. ముఖ్యంగా సెక్యూరిటీ చెకింగ్స్‌పై నిఘా పెట్టాడు. ఎక్కడెక్కడా ఎలా చెక్ చేస్తున్నాడో గమనించాడు. మొత్తంగా రెక్కీ నిర్వహించాడు. విజిటర్స్‌ని గ్యాలరీలోకి పంపే ముందు పూర్తిగా చెక్ చేయడం లేదని గమనించాడు. పైగా షూస్‌ని చెక్ చేయడం లేదని గుర్తించాడు. ఈ లూప్‌హోల్‌ని గుర్తు పెట్టుకుని సభలోకి వచ్చే ముందు షూలో కలర్ గ్యాస్ క్యానిస్టర్‌లు దాచి పెట్టారు నిందితులు. అందరినీ చెక్ చేసినట్టే చేసి లోపలికి పంపింది (Parliament Security) భద్రతా సిబ్బంది. అక్కడి నుంచి గ్యాలరీలోకి వచ్చిన ఇద్దరు నిందితులు. వచ్చీ రాగానే అక్కడి నుంచి సభలోకి దూకారు. వెంటనే కలర్ గ్యాస్‌ని ప్రయోగించారు. భద్రతలో ఈ లొసుగు గురించి నిందితులు చెప్పిన తరవాతే...ఎంట్రెన్స్ గేట్ వద్ద షూ చెక్ చేయడం మొదలు పెట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది లోక్‌సభ సెక్రటేరియట్. 


రెండు సార్లు రెక్కీ..


లలిత్ ఝా (Lalit Jha) అనే ఓ టీచర్ దాడి వెనకాల మాస్టర్‌మైండ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. వర్షాకాల సమావేశాల సమయంలోనూ నిందితుడు సాగర్ శర్మ ఢిల్లీకి వచ్చి రెక్కీ నిర్వహించినట్టు విచారణలో తేలింది. పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు పాస్ దొరకకపోయినప్పటికీ భద్రతా ఏర్పాట్లపై మాత్రం నిఘా పెట్టాడు. అలా మొత్తం 18 నెలల్లో రెండు సార్లీ రెక్కీ చేసి ఇలా దాడి చేశారు. ఈ ఘటన తరవాత విజిటింగ్ పాస్‌లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. 2001లో డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. సరిగ్గా 22 ఏళ్ల తరవాత అదే రోజున ఆగంతకులు ఇలా సభలోకి దూసుకొచ్చి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ మధ్యే ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ ఇండియాకి వార్నింగ్ ఇచ్చాడు. పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించాడు. అలా బెదిరించిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. 


లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే లోక్‌సభ సెక్రటేరియట్‌ కూడా సీరియస్ అయింది. అన్ని అంచెల భద్రతను దాటుకుని ఆ ఆగంతకులు లోపలికి ఎలా వచ్చారని సిబ్బందిని ప్రశ్నించింది. ఈ మేరకు 8 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ దాడిని అందరూ ఖండించారని, అవసరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.


Also Read: Aadhaar News: ఆధార్‌ విషయంలో కేంద్రం సీరియస్‌, రూ.50 వేలు ఫైన్‌ కట్టిస్తామని వార్నింగ్‌