Paid period leaves for Women:


నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ క్లారిటీ..


మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన నెలసరి సెలవులు (Paid menstrual leaves) ఇవ్వాలన్న డిమాండ్‌ని కొట్టి పారేశారు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ. రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా ఈ వాదన తీసుకురాగా...అలాంటి ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ప్రతి మహిళ జీవితంలో నెలసరి అనేది శారీరక ధర్మమని...దాన్ని కారణంగా చూపించి ప్రత్యేక సెలవులు పొందాలనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. అదేమీ వైకల్యం కాదని మండి పడ్డారు. ఇలాంటి సెలవుల కారణంగా కొంత మంది మహిళలపై వివక్ష చూపించినట్టవుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో నెలసరి పరిశుభ్రత గురించీ (menstrual hygiene) చర్చించారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఓ పాలసీని తీసుకురానున్నట్టు ప్రకటించారు. 


"నెలసరి, రుతుస్రావం అనేది వైకల్యం కాదు. ప్రతి మహిళ జీవితంలోనూ ఇది సహజంగా జరిగే ప్రక్రియ. నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల కొంత మంది మహిళలపై వివక్ష చూపించినట్టవుతుంది. అందుకే...ఈ తరహా సెలవులు ఇవ్వాలన్న ఆలోచనే మాకు లేదు. ఇలా చేయడం ద్వారా నెలసరి రాని మహిళలను తక్కువ చేసినట్టుగా అవుతుంది. అది పూర్తిగా రుతుస్రావంపై అనవసరమైన వాదనలు జరిగేందుకు అవకాశమిస్తుంది"


- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి


హైజీన్‌పై అవగాహన..


నెలసరి సమయంలో ఎలాంటి పరిశుభ్రతను పాటించాలో యువతుల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వెల్లడించారు స్మృతి ఇరానీ. కేంద్ర ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించి ఓ ముసాయిదానీ రూపొందించింది. ఇప్పటికే Promotion of Menstrual Hygiene Management (MHM) స్కీమ్ అమల్లో ఉన్నట్టు గుర్తు చేశారు. 10-19 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలకు నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ పథకం లక్ష్యం అని వివరించారు. ప్రస్తుతానికి స్పెయిన్‌లో పెయిడ్ పీరియడ్ లీవ్స్ అందుబాటులో ఉన్నాయి.