Security Breach in Lok Sabha:


నిందితుల నేపథ్యమిదే..


లోక్‌సభపై దాడి చేసిన (Security Breach Lok Sabha) నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం ఆరుగురు కలిసి 18 నెలలుగా దాడికి ప్లాన్ చేస్తున్నట్టు తేలింది. సాగర్ శర్మ (Sagar Sharma), మనోరంజన్‌ (Manoranjan) సభలో దాడి చేయగా...అమోల్ శిందే, నీలం దేవి పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనతో మరో ఇద్దరికీ సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వాళ్లలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల బ్యాగ్రౌండ్‌పై విచారణ కొనసాగిస్తున్నారు. ఏ సంస్థతో అయినా వీళ్లకు సంబంధం ఉందా..? ఎవరైనా కావాలనే రెచ్చగొట్టి ఈ పని చేయించారా అన్న కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ల బ్యాగ్రౌండ్‌ గురించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నిందితుల్లో ఒకరైన మనోరంజన్‌కి మైసూరు ఎంపీ ప్రతాప్ సింహాకి (MP Pratap Simha) కొంత పరిచయం ఉంది. మైసూరులోనే ఉంటున్న మనోరంజన్‌ తెలిసిన వాళ్ల ద్వారా ఎంపీని పరిచయం చేసుకున్నాడు. తండ్రి దేవరాజే గౌడ చెప్పిన వివరాల ప్రకారం...మనోరంజన్ 2016లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ఢిల్లీ, బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేసినా..తరవాత పూర్తిగా వ్యవసాయమే చేస్తున్నాడు. సమాజానికి ఏదోటి చేయాలనే తపన తన కొడుకులో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుందని దేవరాజే గౌడ వెల్లడించారు. స్వామి వివేకానంద పుస్తకాలు ఎక్కువగా చదువుతాడని వివరించారు. 


ఉద్యోగం లేదన్న అసహనంతో..


ఇక లక్నోకి చెందిన సాగర్ శర్మకి, మనోరంజన్‌కి పరిచయముంది. ఆ పరిచయంతోనే ఎంపీ ప్రతాప్ సింహా ఆఫీస్‌కి తీసుకెళ్లాడు. తన ఫ్రెండ్ అని చెప్పాడు. అలా పాస్ సంపాదించాడు. సాగర్ శర్మ సోషల్ మీడియా పోస్ట్‌లు అన్నీ భగత్‌ సింగ్, మార్క్సిజం, చే గువెరా సిద్ధాంతాలతో నిండిపోయాయి. మూడో నిందితుడు విశాల్ శర్మ ఆటోరిక్షా డ్రైవర్‌గా (Vishal Sharma) పని చేసే వాడు. ఈ మధ్యే భార్యతో గొడవ జరిగినట్టు స్థానికులు చెప్పారు. ఈ దాడి వెనకాల విశాల్ శర్మ భార్య హస్తం కూడా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరైన నీలం దేవి (Neelam Devi) హరియాణా వాసి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. MA,BEd,M.Ed,M.Philతో పాటు NET ఎగ్జామ్‌ని కూడా క్లియర్ చేసింది. టీచర్ ఉద్యోగం కోసం నిరీక్షిస్తోంది. పార్లమెంట్ బయట కలర్ టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇద్దరిలో ఈ యువతి కూడా ఉంది. ఉద్యోగం రాలేదని చాలా రోజులుగా తీవ్ర అసహనంతో ఉంటున్నట్టు ఆమె తల్లి వివరించారు. మహారాష్ట్రకు చెందిన అమోల్ షిందే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్లంబర్‌కి హెల్పర్‌గా చాలా రోజుల పాటు పని చేశాడు. ఆ ఉద్యోగం నచ్చక మానేశాడు. గుడ్‌గావ్‌లోని ఓ ఇంట్లో మనోరంజన్, సాగర్, నీలం, అమోల్ కలిసే ఉంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వీళ్లందరినీ విచారిస్తున్నారు పోలీసులు. లలిత్ ఝా అనే ఓ లెక్చరర్ ఈ దాడి వెనకాల మాస్టర్ మైండ్‌ అని అనుమానిస్తున్నారు. పార్లమెంట్‌ని విజిట్ చేయాలని చెప్పి ప్రతాప్ సింహా ఆఫీస్ నుంచి విజిటర్ పాస్‌లు సంపాదించారు. ఆ తరవాత 5 కలర్ స్మోక్ క్యానిస్టర్‌లు కొనుగోలు చేసి దాడి చేశారు. 


Also Read: Lok Sabha Security Breach: అందుకే లోక్‌సభపై దాడి చేశాం! విచారణలో నిజాలు బయట పెట్టిన నిందితులు