US Fed holds interest rates steady: అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడ్‌ (US FED) ఈ ఏడాదిలోనే అత్యుత్తమ తీపి కబురు చెప్పింది. రెండు రోజుల సమావేశంలో FOMC (Federal Open Market Committee) తీసుకున్న పాలసీ నిర్ణయాలు నిన్న (బుధవారం, 13 డిసెంబర్‌ 2023) వెలువడ్డాయి. నిన్న మన మార్కెట్లు ముగిసిన తర్వాత, యూఎస్‌ ఫెడ్‌ ఛైర్‌ జెరోమ్‌ పావెల్‌ ‍‌(FED Chair Jerome Powell) ఈ నిర్ణయాలను ప్రకటించారు. 


వరుసగా మూడోసారి స్టేటస్‌-కో 
వరుసగా మూడోసారి కూడా కీలక వడ్డీ రేట్లలో (Interest rates in America) యూఎస్‌ కేంద్ర బ్యాంక్‌ ఎలాంటి మార్పులు చేయలేదు, వాటిని 5.25-5.50 స్థాయిలో స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం, అమెరికాలో వడ్డీ రేట్లు 22 ఏళ్ల గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. 2023 క్యాలెండర్‌ సంవత్సరంలో ఇదే చివరి పాలసీ మీటింగ్‌. 


USలో, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని ప్రపంచ మార్కెట్లు ముందు నుంచి ఊహిస్తున్నాయి, ఈ నిర్ణయం ఏ మాత్రం ఆశ్చర్యకరం కాదు. అయితే, ఆ సమావేశంలో పావెల్‌ చేసిన స్టేట్‌మెంట్స్‌ ప్రపంచ మార్కెట్ల నెత్తిన పాలుపోశాయి.


2024లో ఉపశమనంపై సిగ్నల్స్‌
అమెరికాలో ద్రవ్యోల్బణం ‍‌(Inflation in America) అదుపులోకి రావడంతో పాటు, కీలక ఆర్థిక డేటాల్లో బలం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, అధిక రేట్ల నుంచి 2024లో ఉపశమనం ఉండొచ్చన్న సిగ్నల్స్‌ ఇచ్చారు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్. వడ్డీ రేట్ల పెంపు సైకిల్‌ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్లే అన్నారు. అంటే, ఇంట్రస్ట్‌ రేట్లు ఇంతకు మించి పెరగవని స్పష్టం చేశారు. ఈక్విటీ మార్కెట్లకు ఇది పాజిటివ్‌ న్యూస్‌. 


దీంతోపాటు, వచ్చే ఏడాది (2024) వడ్డీ రేట్లను 0.75 శాతం తగ్గించడం గురించి కూడా పావెల్‌ మాట్లాడారు. ఇదే అసలు సిసలైన సూపర్‌ సిగ్నల్‌. 2024లో మూడు దఫాల్లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చని పావెల్‌ సంకేతాలు ఇచ్చారు. 


అమెరికాలో నిరుద్యోగ రేటు 2024 నాటికి 4.1 శాతంగా ఉంటుందని యూఎస్‌ ఫెడ్‌ అంచనా వేసింది. వచ్చే ఏడాది అమెరికా GDP వృద్ధి అంచనాను 1.5 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గించింది.


యూఎస్‌లో ఇన్‌ఫ్లేషన్‌ తగ్గిందని, అయితే అది తమ అంచనాలకు మించి ఉందని ఫెడ్ చైర్మన్‌ చెప్పారు. ఫెడ్ లెక్క ప్రకారం, ప్రధాన ద్రవ్యోల్బణం (Core Inflation) రేటు 2024 చివరి నాటికి 2.4 శాతానికి తగ్గుతుందని అంచనా. ఇది, గత సెప్టెంబరులోని అంచనా 2.6 శాతం అంచనా కంటే తక్కువగా ఉంది. కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌లో ఆహారం & ఎనర్జీ వ్యయాలు ఉంటాయి. ఇది, ద్రవ్యోల్బణం వైఖరిని అంచనా వేసే మెరుగైన కొలమానం.


అమెరికా మార్కెట్లలో సంబరాలు
FOMC నిర్ణయాలు వెలువడిన తర్వాత, బుధవారం, US మార్కెట్లలో పూర్తిస్థాయి సానుకూల వాతావరణం, ఎనలేని ఉత్సాహం కనిపించాయి. 2022 జనవరి తర్వాత, డౌ జోన్స్ 1.4 శాతం పెరిగి రికార్డు గరిష్ట స్థాయిలో ముగిసింది. నాస్‌డాక్, S&P 500 తలో 1.38 శాతం లాభపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌లో బ్లాస్టర్‌ ఓపెనింగ్‌ - రికార్డ్‌ స్థాయుల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ