Bharat Jodo Yatra: 


ఒక్కరి కోసం కాదు : జైరాం  రమేశ్


రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్‌ జోడో యాత్ర హరియాణాకు చేరుకుంది. కర్నాల్‌లో సాగిన యాత్రలో సీనియర్ నేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ని పీఎం క్యాండిడేట్‌గా చూపించాలన్న ఉద్దేశంతో ఈ యాత్ర చేయడం లేని స్పష్టం చేశారు. "రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం  భారత్ జోడో యాత్ర ఉద్దేశం కానే కాదు" అని 
వెల్లడించారు. దేశాన్ని జోడించేందుకు జరుగుతున్న ఈ యాత్రకు రాహుల్‌ ఓ సారథి మాత్రమేనని అన్నారు. ఇది కేవలం ఒక్కరి కోసం జరుగుతున్న యాత్ర కాదని తెలిపారు. ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్  విజేందర్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నేతలు భూపీందర్ సింగ్ హుడా, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా రాహుల్‌తో కలిసి నడిచారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ సాగే ఈ యాత్రలో రాహుల్ ఎన్నో సమస్యలను
చర్చించారని అన్నారు జైరాం రమేశ్. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, రాహుల్ ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు రాహుల్ పీఎం అభ్యర్థి అంటూ కొందరు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో...జైరాం రమేశ్ స్పష్టతనిచ్చారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో  2024 ఎన్నికల పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ స్పష్టం చేశారు. 






రాహుల్ ఫైర్..


రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారంటూ సీఆర్‌పీఎఫ్‌ ఇటీవలే వెల్లడించింది. దీనిపై రాహుల్ మండి పడ్డారు. ఉద్దేశపూర్వకంగా తన చుట్టూ ఓ గోడను కట్టి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. పదేపదే సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ ఉల్లంఘిస్తున్నారంటూ CRPF చెప్పడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పదేపదే లేఖలు పంపిస్తూ తమ యాత్రను ఆపేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో బీజేపీ రోడ్‌షోల గురించీ ప్రస్తావించారు. కొవిడ్ ప్రోటోకాల్స్‌ వాళ్లకు మాత్రం వర్తించవా అంటూ ప్రశ్నించారు. "బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌లో తిరగాలనిహోం శాఖ  చెబుతోంది. అదెలా సాధ్యమవుతుంది..? నడుచుకుంటూ యాత్ర చేయాలి. సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేయాలన్నది వాళ్లకు తెలిసే ఉంటుందిగా. కావాలనే దీన్ని ఇష్యూ చేస్తున్నారు" అని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీతో పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని  అన్నారు. "ప్రతి ప్రతిపక్ష నేత భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలబడుతున్నారు. కానీ..కొన్ని పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి" అని వెల్లడించారు. రాజకీయాల్లో ఏమేం చేయకూడదో నేర్పిస్తున్న బీజీపేయే తనకు గురువు అని సెటైర్లు వేశారు. 2024 ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. విద్వేషాలు లేని భారత్‌ తమ లక్ష్యమని తెలిపారు. "జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి సమస్యల గురించి ప్రజలంతా చర్చించుకునేలా చేయగలిగాం" అని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీకి ధన బలం ఉన్నా... నిజంతో పోరాడి గెలవడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. 


Also Read: Surendran K Pattel: బీడీలు చుట్టిన వ్యక్తి అమెరికాలో జడ్జ్ అయ్యాడు, చరిత్ర సృష్టించిన భారతీయుడు