Kamareddy Collector: కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రాథమిక దశలో ఉందని.. ఇందుకోసం డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఇందులో అభ్యంతరాలకు నవంబర్ 13వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు 60 రోజులు సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రైతులు తమ భూములు పోతున్నాయనే అపోహలు వదలాలని అన్నారు. గతంలో 2000 సంవత్సరంలో కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణ పరిధికి తగ్గట్టు మాస్టర్ ప్లాన్ కూడా మారుతుందని ఆయన వివరించారు. ఫిర్యాదులు ఇవ్వాలంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఇవ్వాలని కలెక్టర్ చెప్పుకొచ్చారు. మార్పులు, చేర్పులు అయ్యాక ఫైనల్ కు వెళ్తుందని వెల్లడించారు.
రైతుల భూములు ఎక్కడికి పోవని, వాళ్ల భూములపై అధికారం వాళ్లకే ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు. ప్రస్తుతం ఇచ్చింది డ్రాఫ్ట్ ప్లాన్ మాత్రమే అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పదే పదే చెప్పారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చని అన్నారు. ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయని వివరించారు. జనవరి 11 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉందన్నారు. పంట పొలాల్లో ఇండస్ట్రీయల్ జోన్ పెట్టడం లేదని, ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూసేకరణ కాదన్నారు. రైతులకు అనుమానాలు ఉంటే కలెక్టర్ ఆఫీస్ లో నివృత్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయడం సరికాదన్నారు. అలా చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టం చేశారు.
కోర్టుకెళ్లిన రైతులు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇష్యూ హైకోర్టుకు చేరింది. తమ ప్రమేయం లేకుండా తమ అనుమతి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్‌కు అనుమతులు ఇచ్చారని రైతులు కోర్టులో పిల్ వేశశారు. రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు తమ భూములను రిక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ వల్ల పట్టా భూములు కోల్పోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు కేసును సోమవారం విచారణ చేపట్టనున్నట్లు న్యాయవాది సృజన్ కుమార్ రెడ్డి తెలిపారు.
గత కొన్ని రోజులుగా కామారెడ్డి పట్టణంలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. తమ వ్యవసాయ భూములు ఇండస్ట్రియల్ జోన్ లో కావటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు కొనసాగిస్తున్నారు. భారీగా రైతులు తమ కుటుంబాలతో తరలి వచ్చి కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేశారు. రైతుల ఉద్యమానికి కాంగ్రెస్, బిజెపి నాయకులు సైతం మద్దతు తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే ఒక రోజంతా రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. రైతులకు మద్దతుగా నిలిచారు. శుక్రవారం కామారెడ్డి పట్టణం బంద్ కు కూడా రైతులు పిలుపు నివ్వటంతో వ్యాపారులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.