Surendran K Pattel Journey:


జిల్లా కోర్టు జడ్జ్‌గా నియామకం..


భారతీయులు విదేశాల్లో అత్యున్నత పదవులకు ఎంపికవుతున్నారు. ఈ ట్రెండ్ చాన్నాళ్లుగా కొనసాగుతోంది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యారు. అమెరికాలో భారతీయులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో భారతీయుడు సంచలనం సృష్టించాడు. బీడీలు చుట్టుకుంటూ జీవనం సాగించిన కేరళకు చెందిన సురేంద్రన్ కే పటేల్..ఇప్పుడు టెక్సాస్‌లో జిల్లా కోర్టు జడ్జిగా ఎన్నికయ్యారు. జనవరి 1వ తేదీన టెక్సాస్‌ ఫోర్ట్ బెండ్ కౌంటీలోని జిల్లా కోర్టు జడ్జ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవికి గతేడాది నవంబర్ 8న ఎన్నికలు జరగ్గా...రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఎడ్వర్డ్ క్రెనెక్‌ను ఓడించారు సురేంద్రన్. కేరళలో ఓ పేద కుటుంబంలో పుట్టినప్పటి నుంచి ఇప్పుడు అమెరికాలో జడ్జ్‌గా ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ చేసిన ఈ ప్రయాణం స్ఫూర్తిగా నిలుస్తోంది. 


కేరళలో పుట్టిన సురేంద్రన్..


కేరళలోని కాసర్‌గడ్‌లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు సురేంద్రన్. తల్లిదండ్రులిద్దరూ రోజు కూలీలు. అటు బయట పనులు చేస్తూనే చదువు సాగించారు సురేంద్రన్. పొట్టకూటి కోసం బీడీలు చుట్టారు. తన సోదరితో కలిసి ఈ పని చేసే వారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక పదో తరగతిలో చదువు మానేయాల్సి వచ్చింది. పూర్తిగా పనిలో చేరిపోయారు. చాలా రోజుల పాటు బీడీలు చుట్టారు. ఆ తరవాత ఎలాగోలా మళ్లీ చదువు కొనసాగించారు. ఈ పనులు చేస్తూనే చదువుకున్నారు. లాయర్ అవ్వాలని కలగన్నారు సురేంద్రన్. కానీ అది ఎలాగో తెలియలేదు. పొలిటికల్ సైన్స్‌ స్ట్రీమ్ తీసుకున్నా క్లాస్‌లకు వెళ్లలేకపోయారు. కుటుంబ పోషణ కోసం పనులు చేయాల్సి వచ్చేది. క్లాస్‌మేట్స్ ఇచ్చిన నోట్స్‌తో చదువుకునే వారు. అటెండెన్స్ తగ్గడం వల్ల ఎగ్జామ్స్ రాయడానికి ప్రొఫెసర్లు అనుమతించలేదు. "నేను బీడీలు చుడతానని చెప్పడం ఇష్టం లేదు. నాపైన సింపథీ చూపించడం అంత కన్నా ఇష్టం లేదు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరాను. మార్కులు సరిగా రాకపోతే డిస్‌కంటిన్యూ చేస్తానని చెప్పాను" అని ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు సురేంద్రన్. ఆ ఏడాది కాలేజ్ టాపర్‌గా నిలిచారు. 






రాజకీయాలపైనా ఆసక్తి..


ఫ్రెండ్స్ వద్ద డబ్బు అప్పు తీసుకుని ఓ లా యూనివర్సిటీలో చేరారు. 1995లో లా పట్టా అందుకున్నారు. 2007లో సురేంద్రన్ సతీమణికి అమెరికన్ మెడికల్ ఫెసిలిటీలో నర్స్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. వెంటనే హూస్టన్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఏ పని చేయాలో తెలియక ఓ గ్రాసరీ స్టోర్‌లో పని చేశారు. తరవాత ఎన్నో సవాళ్లు, సమస్యలు దాటుకుని University of Houstonలో చేరారు. ఇంటర్నేషనల్ లా చదివారు. 
2011లో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తరవాత కాంట్రాక్ట్ వర్కర్‌గా పని చేశారు. 2017లో అమెరికా పౌరసత్వం పొందిన సురేంద్రన్ పటేల్ రాజకీయాలపైనా ఆసక్తి చూపించారు. 2020లోనే ఈ జడ్జ్ పదవికి పోటీ చేసినా...అప్పుడు గెలవలేదు. ఈ సారి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 


Also Read: Ram temple: అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు, వచ్చే ఏడాది మకర సంక్రాంతి వరకూ వేడుకలు