Oreo Biscuits in UAE:
నాన్ హలాల్ అంటూ ప్రచారం..
యూఏఈలో ఓరియో (OREO) బిస్కెట్‌లపై పెద్ద వివాదం నడుస్తోంది. యూఏఈ ప్రభుత్వం ఓరియో బిస్కెట్‌లను నాన్ హలాల్ (Non Halal) ప్రొడక్ట్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలూ వచ్చాయి. దీనిపై అధికారులు స్పందించారు. "ఓరియో బిస్కెట్‌లు నాన్ హలాల్ అని, ఈ బిస్కెట్‌లలో పంది మాంసం, ఆల్కహాల్ ఉన్నాయని ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అది ముమ్మాటికీ తప్పు" అని యూఏఈ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఓరియో బిస్కెట్‌లో ఎలాంటి మాంసం లేదని, జంతువుల కొవ్వుతో తయారయ్యాయన్న ప్రచారమూ అవాస్తవం అని వెల్లడించింది. ఇక ఇందులో ఆల్కహాల్ ఉంటుందన్న ప్రచారాన్ని కొట్టి పారేసింది. "ఇది నిజం కాదు. ఇదో డ్రై ప్రొడక్ట్. అందులో ఆల్కహాల్ కలవదు. లేబొరేటరీ టెస్ట్‌ల ఫలితాల ఆధారంగానే ఇది చెబుతున్నాం" అని అధికారులు తెలిపారు. అత్యున్నత ప్రమాణాలు పాటించిన ఆహార పదార్థాలనే దిగుమతి చేసుకుంటున్నామని తేల్చి చెప్పింది. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అధికారులు. ఇక ఈ పోస్ట్‌ని తీవ్రంగా పరిగణించింది...అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్‌టీ అథారిటీ. ఇందులోపంది కొవ్వు కలుపుతారన్న ప్రచారాన్ని ఖండించింది. కొన్ని ఆహార పదార్థాల్లో ఇథనాల్ కలుస్తుందని, ఫర్మెంటేషన్‌కు అది అవసరం అని తెలిపింది.
హలాల్ అంటే ఏంటి..
హలాల్ అనే పదం.. అరబ్బీ నుంచి వచ్చింది. హలాల్ అంటే ధర్మబద్ధమైనది లేదా అనుమతించదగినదని అర్థం. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు అంతా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఆహార పదార్థాల వాణిజ్య మార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా. హలాల్‌కు వ్యతిరేక పదం హరామ్. దీనికి నిషేధించినది, అధర్మమైనది, అనైతికమైనది అని అర్థం ఉంది. ఆహార పదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సంప్రదాయం ముస్లింలలో ఉంది. జంతువుల మాంసాలను, హలాల్ చేసిన తరువాత మాత్రమే తినాలని వారు నమ్ముతారు. హలాల్ అనేది జంతువును వధించేందుకు వాడే ఓ పద్ధతి. ఇందులో మొదట జంతువుల మెడ దగ్గర నరాన్ని కోసి రక్తం బయటకు వచ్చేలా చూస్తారు. ఆ రక్తం జంతువు శరీరంలోనే ఉండిపోతే.. దాన్ని తినడంతో మనకు జబ్బులు వస్తాయని మహమ్మద్ ప్రవక్త చెప్పారు. రక్తం మొత్తం బయటకు వెళ్లిపోతే, ఆ మాంసాన్ని తిన్న తర్వాత మనకు ఏమీ కాదని వారు నమ్ముతారు. ఈ పద్ధతిని జబీహా అని పిలుస్తారు.
Also Read: Ram temple: అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు, వచ్చే ఏడాది మకర సంక్రాంతి వరకూ వేడుకలు