K A Paul :  కిలారి ఆనంద్  పాల్ అంటే ఎవరీయన అంటారేమో కానీ కేఏ పాల్ అంటే మాత్రం తెలియని వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో లేరు. ఒకప్పుడు ఆయన కూటములు పెడితే లక్షల్లో జనం వచ్చే వారు. కానీ ఇప్పుడు ఆయనే ఎక్కడ మీడియా మైకులు ఉంటాయో అక్కడకు పరుగులు పెడుతున్నారు. అది ఆంధ్రానా తెలంగాణనా అన్నది ఆయనకు అనవసరం. వెళ్లడం మీడియా ముందు... ఔరా అనిపించే ప్రకటనలు చేయడం... రావడం ఆయనకు కామన్ అయిపోయింది. కేఏ పాల్ రాజకీయం చేస్తున్నాడో.. మీడియాలో పబ్లిసిటీ కోసమే రోజంతా పనిచేస్తున్నారో తెలియదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ  సంచలనాత్మక ఇన్సిడెంట్ జరిగినా .. అక్కడ రాజకీయంగాతన ఉనికిని చాటుకుంటున్నారు. 


పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లి ఆయన కోసం నాలుగు గంటలు వెయిట్ చేసి.. ఆ తర్వాత తనే పవన్ కల్యాణ్‌కుపది నిమిషాలు అపాయింట్‌మెంట్ ఇచ్చానని చెప్పుకునే గడుసుతనం కేఏ పాల్ సొంతం. ఆ గడుసుతనం ఆయన వరకే. ఇతరులకు అయితే హిలేరియస్ కామెడీ. ఈ విషయం ఆయన గుర్తించలేకపోతున్నారో లేకపోతే.. తన గత ఇమేజ్ లోనే జనం ఉన్నారని అనుకుంటున్నారో కానీ.. అదే టైపులో ఇప్పటికీ వ్యవహరిస్తూనే ఉన్నారు. ఆయన మత  ప్రచార కార్యక్రమాలు ఎప్పుడో మానేశారు. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇండియాలోనే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతున్నారు. ఏ ఇన్సిడెంట్ జరిగినా రాజకీయంగా స్పందిస్తున్నారు. 


ఏపీలో కుందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది. దానిపై ఎంత రాజకీయ రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య రచ్చ జరిగింది. ఈ మధ్యలో కేఏ పాల్ కూడా హైలెట్ అయిపోయారు. ఆయన వెంటనే... ఈ రెండు పార్టీల మధ్య దూరిపోయారు. చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీడియా అటెన్షన్ పొందారు. చంద్రబాబుపై కేసులు పెట్టాలన్నారు. ఈ అంశంపై స్టేట్ మెంట్లు మాత్రమే కాదు.. కోర్టుకు కూడా వెళ్లారు. రెండు, మూడు రోజుల పాటు కందుకూరు ఇష్యూలో కేఏ పాల్ ఖచ్చితంగా అందరికీ కనిపించారు. వినిపించారు. 


ఇప్పుడు ఆయన కామారెడ్డి జిల్లాలో కనిపిస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో అక్కడి రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వివాదం పెరిగి పెద్దదయిపోయింది. రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ ఈ అంశాన్ని ప్రయారిటీగా తీసుకున్నాయి. మరి కేఏ పాల్ మాత్రం ఊరుకుంటారా? తాను కూడా అక్కడకు వెళ్లిపోయారు. మీడియా గొట్టాల ముందు తాను చేయాల్సిన రాజకీయం తాను చేశారు. ఘాటైన స్టేట్‌మెంట్లు ఇచ్చారు.   ఇక అందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉపఎన్నికల్లో ఆయన చేసిన హడావుడి రోజూ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది. 


అయితే కేఏ పాల్ రాజకీయం చేస్తున్నారు కానీ.. ఆయన చాలా తెలివిగా ఈ స్టేట్ మెంట్లు ఇస్తూంటారు. గతంలో ఆయనపై సిద్దిపేట జిల్లాలో దాడి జరిగింది. అందుకే ఈ సారి వ్యూహాత్మకంగా కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో బీజేపీకి వ్యతిరేకంగానేఎక్కువగా మాట్లాడారు. ఏపీలో ప్రతిపక్షం గురించే మాట్లాడారు. పాల్ కు కూడా రాజకీయ లౌక్యం బాగా అలవడుతోందని ఇలాంటి స్టేట్మెంట్ల కారణంగా ఆయనపై సెటైరిక్‌గా ప్రశంసలు కురిపిస్తూంటారు నెటిజన్లు.