Bengaluru-Mysuru Expressway:


వారం క్రితమే ప్రారంభించిన ప్రధాని 


వారం రోజుల కింద ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించారు. అయితే...కర్ణాటకలో కురిసిన వర్షాలకు ఈ రోడ్‌లో నీళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలా వెహికిల్స్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కాస్తా వైరల్ అయ్యాయి. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలూ మొదలయ్యాయి. దీనిపై స్పందించిన NHAI వీలైనంత త్వరగా ఈ నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


"వాన నీళ్లు వెళ్లిపోవడానికి మేం ప్రత్యేకంగా కొంత స్పేస్‌ అలాగే ఉంచాం. కానీ కొంత మంది గ్రామస్థులు వాటిని మట్టితో నింపేశారు. అందుకే ఇలా వరద వచ్చింది. నీళ్లు నిలిచిపోయాయి. వీటిని తొలగిస్తున్నాం. త్వరలోనే రూట్ క్లియర్ చేస్తాం"


- NHAI


గతేడాది ఆగస్టులోనూ వర్షాలు పడినప్పుడు ఇదే దారిలో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. టెక్నికల్ టీమ్‌ ఈ సమస్యను పరిష్కరిస్తుందని  ఈ ఏడాది జనవరిలో పర్యటించిన సమయంలో హామీ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకే కట్టుబడి ఉన్నామని వివరించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఇదే హైవేలో నీళ్లు నిలిచిపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.