Bengal SSC Scam: 


సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న అధికారులు


పశ్చిమ బెంగాల్‌లోని ఎస్‌ఎస్‌సీ స్కామ్ మరో మలుపు తిరిగింది. పార్థ ఛటర్జీ సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు విలాసవంతమైన కార్లు కనిపించకుండా పోయాయి. కలకత్తాలోని టోలిగుంజేలో తొలిసారి ఈడీ అధికారులు అర్పిత ముఖర్జీ ఇంటిని సోదా చేశారు. ఆ సమయంలోనే ఆమెకు నాలుగు లగ్జరీ కార్లున్నాయని ఈడీకి తెలిసింది. ఆడీ A4,హోండా సిటీ, హోండా సీఆర్‌వీ, మెర్సిడెస్‌ బెంజ్ కార్లున్నాయని తేలింది. అయితే ఆమెను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆ కార్లు కనిపించకుండా పోయాయి. ఈడీ అధికారులు ఆమె ఇల్లు ఉన్న ప్రాంతంలోని సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. అవి ఏమైపోయాయని ఆరా తీస్తున్నారు. అర్పిత ముఖర్జీ ఫ్లాట్‌లోని సీసీటీవి విజువల్స్‌ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ నాలుగు కార్లలో, రెండు కార్లు అర్పిత పేరుపైనే రిజిస్టర్ అయి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిచంగా, రెండు రియల్ ఎస్టేట్‌ కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. వీటితో పాటు రూ.28 కోట్ల 
నగదునీ స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను ఈడీ ఇన్వెస్టిగేటర్లు పరిశీలిస్తున్నారు. ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల అడ్రెస్‌, అర్పిత ముఖర్జీ ఇంటి అడ్రెస్‌ మ్యాచ్ అవుతున్నాయని వెల్లడించారు. 2017లో రూ.లక్ష పెట్టుబడితో ఈ కంపెనీలు ప్రారంభించినట్టు నిర్ధరించారు. 


చినార్క్ పార్క్‌లోని ఫ్లాట్‌లోనూ సోదాలు 


చినార్ పార్క్‌ ఏరియాలో ఉన్న మరో ఇంట్లోనూ ఈడీ సోదాలు కొనసాగించింది. ఇక్కడ కూడా పెద్ద మొత్తంలో నగదు దొరికే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న వారిని కూడా విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఫ్లాట్‌లో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయో ఆరా తీస్తున్నారు. డోర్ లాక్ వేసి ఉండటం వల్ల, పగలగొట్టి మరీ లోపలకు వెళ్లారు అధికారులు. అర్పిత ముఖర్జీని విచారిస్తుండగా, చినార్ పార్క్‌లోని ఫ్లాట్‌ గురించి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దొరికిన బంగారం విలువ ఎంత అన్నది పూర్తిగా వెల్లడించలేదు. 


మంత్రి పదవి నుంచి తొలగింపు 


ఇటు ప్రభుత్వం కూడా పార్థ ఛటర్జీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్ సర్వీస్ కమిషన్‌లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారికంగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా ఉన్న ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతకు ముందు కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ మీటింగ్‌లో పార్థ ఛటర్జీ గురించి ఎలాంటి చర్చ రాలేదని అంతకు ముందు సమాచారం వచ్చింది. కానీ...ఈ భేటీ ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించటమే మంచిది" అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేశారు. తరవాత ఆ ట్వీట్‌ తొలగించారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీ ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ నిర్ణయం ప్రకటించక ముందు స్పష్టం చేశారు.


Also Read: Mass Hysteria: మాస్ హిస్టీరియాతో తలలు బాదుకున్న విద్యార్థులు, అసలేంటి ఈ హిస్టీరియా? ఎందుకు వస్తుంది?


Also Read: Greater Noida: ఓనర్‌లనే ముప్పతిప్పలు పెట్టిన టెనెంట్, ఇంట్లోకి రానివ్వకుండా రుబాబు