Greater Noida:
ముందే చెప్పినా పట్టించుకోలేదు..
అద్దె ఇళ్లలో ఉండే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓనర్ చెప్పినట్టుగా నడుచుకోక తప్పదు. కాస్త తేడా వచ్చిందంటే వెంటనే పెద్ద రాద్ధాంతం చేసే ఓనర్లు ఉంటారు. ఎంత సర్ది చెబుదామని చూసినా మాట వినరు. ఇలాంటి వాళ్లతో పడలేక తెగ బాధ పడిపోతుంటారు అద్దెకు ఉండేవాళ్లు. అయితే కొందరు టెనెంట్లు, ఓనర్లనే ఇబ్బంది పెట్టేస్తారు. రకరకాల కారణాలు చెప్పి సమస్యలు సృష్టిస్తుంటారు. ఇక రెంటల్ అగ్రిమెంట్‌ల విషయంలో అయితే తరచూ గొడవలు అవుతూనే ఉంటాయి. గ్రేటర్ నోయిడాలో ఓ జంటకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సునీల్ కుమార్, రాఖీ గుప్తా గ్రేటర్ నోయిడాలోని శ్రీ రాధ స్కై గార్డెన్ సొసైటీలోని ఫ్లాట్‌ని ఓ మహిళకు లీజ్‌కు ఇచ్చారు. నెల క్రితమే ఈ అగ్రిమెంట్ ఎక్స్‌పైర్ అయిపోయింది. వెంటనే ఈ దంపతులు తమ ఫ్లాట్‌కు వచ్చారు. అయితే లీజ్‌కు తీసుకున్న మహిళ మాత్రం ఇందుకు అసలు అంగీకరించలేదు. లీజ్ అగ్రిమెంట్ గడువు ఇంకా పూర్తి కాలేదని గొడవకి దిగింది. ఈ వాగ్వాదం ముదరటం వల్ల దంపతులను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా చేసింది లీజ్‌కు తీసుకున్న మహిళ. దాదాపు వారం రోజులుగా తమ సామాన్లతో అలాగే మెట్లపైనే ఉండిపోయారు దంపతులు. "ఈ ఏడాది జూన్ 10 వ తేదీన అగ్రిమెంట్ ఎక్స్‌పైర్ అయింది. అందులో ప్రస్తావించిన విధంగానే, రెండు నెలల ముందే ఆ మహిళకు మేము గుర్తు చేశాం. ఇలా డేట్స్‌తో సహా మేము మెన్షన్ చేసి ఆమెకు మెసేజ్ పంపాం. దాదాపు వారం రోజుల పాటు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు "ఓకే" అని రిప్లై ఇచ్చింది అని వివరించారు సునీల్ కుమార్. ఆమె నుంచి ఈ మెసేజ్ వచ్చాక గానీ ఈ దంపతులు ఫ్లాట్‌లోకి వెళ్లలేకపోయారు. ఇప్పటికీ లీజ్‌కు తీసుకున్న మహిళకు సంబంధించిన కొన్ని సామాన్లు ఫ్లాట్‌లోనే ఉండిపోయాయట.
అండగా నిలిచిన వారికి థాంక్స్..
తమ ఫ్లాట్‌లోకి తాము వచ్చామన్న ఆనందంతో ఈ దంపతులు ఎమోషనల్ అయ్యారు. ఫ్లాట్ ముందు నిలబడి ఫోటోలు కూడా దిగారని స్థానికులు చెబుతున్నారు. అయితే తమకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని రాఖీ గుప్తా, ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. " 2021 జులైలో ప్రీతి అనే మహిళకు ఫ్లాట్‌ను లీజ్‌కు ఇచ్చాం. దీని గడువు 11నెలలు. గత నెలతోనే ఈ గడువు పూర్తైంది. రెండు నెలల క్రితమే ఆమెకు మేం గుర్తు చేశాం. ఫ్లాట్‌ను ఖాళీ చేయమని చెప్పాం. కానీ ఆమె మా మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదు. మా మాటలు పట్టించుకోలేదు" అని రాఖీ గుప్తా వివరించారు. సునీల్ కుమార్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పని చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. గ్రేటర్ నోయిడాలోని సొంత ఫ్లాట్‌కు వెళ్లేందుకు ముంబయి నుంచి వచ్చారు. ఇంతలో ఈ వాగ్వాదం జరిగి వారం రోజుల పాటు నరకం అనుభవించారు. లీజ్‌కు తీసుకున్న మహిళపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌లను ఆశ్రయించారు. అయితే పోలీసులు..ఇది సివిల్ మ్యాటర్ కనుక కోర్టుని ఆశ్రయించాలని సూచించారు.
Also Read: Handicap Person Death : ఎస్సై వేధింపులతోనే చనిపోయాడా?- సంచలనం సృష్టిస్తున్న దివ్యాంగుడి మృతి
Also Read: Mangaluru Man Stabbed: కర్ణాటకలో మరో దారుణ హత్య- ముస్లిం యువకుడ్ని పొడిచి చంపిన దుండగులు!