గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను కొంత మంది ప్రముఖులు తమకు వద్దని ప్రకటనలు చేస్తున్నారు.ఇప్పటికే సీపీఎం సీనియర్​ నేత, బంగాల్​ మాజీ సీఎం బుద్ధదేవ్​ భట్టాచార్య తనకు ప్రకటించిన పద్మభూషణ్‌ను తిరస్కరించారు. నిజానికి కమ్యూనిస్టు పార్టీల నేతలు ఇలాంటి పురస్కారాలు తీసుకోరు.  అయితే బుద్దదేవ్‌తో ముందుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు సంప్రదించి ఉంటే  ఆయన చెప్పి ఉండేవారు. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆయన అంగీకరించారని భావించిన కేంద్రం అవార్డు ప్రకటించింది. తీరా అవార్డు ప్రకటన తర్వాత బుద్దదేవ్ అవార్డును తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. 


మరో వైపు బెంగాల్‌కే చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ,  ప్రముఖ వాద్యకారుడు పండిట్​ అనింద్య ఛటర్జీ కూడా తమకు పద్మ పురస్కారాలు వద్దని స్పష్టం చశారు.   పద్మశ్రీ వచ్చినట్లు మంగళవారమే ఢిల్లీ నుంచి ఫోన్​ద్వారా సమాచారం ఇచ్చారని... అయితే ఇప్పుడు ఆ అవార్డు స్థాయిని తాను దాటిపోయానని అనింద్య ఛటర్జీ స్పష్టం చేశారు. ఆ స్థాయిని ఎప్పుడో దాటేశానని.. ' 10 సంవత్సరాల క్రితమే ఈ పురస్కారం వచ్చి ఉంటే.. ఆనందంగా స్వీకరించేవాడినని ఆయన ప్రకటించారు. ఏదైనా కానీ అవార్డు తనకు వద్దని.. సారీ చెప్పేశారు. తనకు ఫోన్ చేసినప్పుడే ఈ విషయం చెప్పానని అనింధ్య ఛటర్జీ స్పష్టం చేశారు. 


మరో వైపు గాయని సంధ్యా ముఖర్జీ కూడా కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  90 ఏళ్ల వయసులో.. దాదాపు 8 దశాబ్దాల పాటు పాటలు పాడిన వ్యక్తికి 'పద్మశ్రీ' ప్రకటించడం ఆమె స్థాయిని తగ్గించడమేనని సంధ్యా ముఖర్జీ కుమార్తె సౌమి సేన్​గుప్తా ప్రకటించారు. అ అవార్డును తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. పురస్కారాలు తిరస్కరించిన వారంతా బెంగాల్‌కు చెందిన వారు కావడం యాధృచ్చికమే.  కాంగ్రెస్ పార్టీకి చెందిన గులాం నబీ ఆజాద్‌కు కూడా పద్మ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆయన దీన్ని గొప్ప విజయంగా భావిస్తున్నారు. 
 
కేంద్రం ఇష్టా ఇష్టాలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ది కోసమే కొంత మందిని ఎంపిక చేసుకుని ఇలాంటి పురస్కారాలను ప్రకటించిందన్న విమర్శలు ఉన్నాయి. అవార్డులు ప్రకటించే ముందు విజేతల అనుమతి తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే అనుమతి తీసుకోవడం కన్నా.. సమాచారం ఇవ్వడం అనే ప్రక్రియను ప్రస్తుతం పాటిస్తున్నారు. దీని వల్ల సమాచారం ఇచ్చినప్పుడు తమకు పద్మశ్రీ వద్దని చెప్పినప్పటికీ.. జాబితాలో ఉంచేస్తున్నారు. దీని వల్ల ప్రకటన తర్వాత వారు అవార్డుల్ని వద్దని ప్రకటించాల్సి వస్తోంది. ఇది  కేంద్ర ప్రభుత్వానికీ ఇబ్బందికర పరిస్థితి తెచ్చి పెడుతోంది.