Bapatla News: సైకో, రౌడీలా మారిన యువకుడి బారిన పడకుండా తన సోదరిని కాపాడుకోవాలని చూశాడు. తన వయసుకు మించినదే అయినా తండ్రి లేకపోవడంతో తానే బాధ్యత తీసుకున్నాడు. ఈక్రమంలోనే కోపం పెంచుకున్న అల్లరి మూకలు అతడిని దారుణంగా హత్య చేశాయి. ట్యూషన్ కు వెళ్లి వస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించారు. సజీవ దహనం అయ్యేలా చేసి సినిమా చూసినట్లు చూశారు. అయితే అక్కను రౌడీ నుంచి కాపాడేందుకు అమర్నాథ్ రెడ్డి అనే బాలుడు చేసిన ప్రయత్నం చూసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.


మిన్నంటిన ఆందోళనలు..!


పదో తరగతి చదువుతున్న బాలుడు ఉప్పాల అమర్నాథ్ దారుణ హత్యపై బాపట్ల జిల్లాలో శనివారం ఆందోళనలు మిన్నంటాయి. వైసీపీ అల్లరి మూకలే హత్య చేశాయని, ఆ పార్టీ హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. బాలుడి మృతదేహంతో గంటన్నరకు పైగా స్థానిక ఐలాండ్ సెంటర్ లో బాధిత కుటుంబ సభ్యులు గౌడసేన, బీసీ సంఘాలు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో రహదారిపై బైఠాయించారు. గుంటూరు నుంచి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో అంబులెన్సులో అమర్నాథ్ మృతదేహాన్ని బాలుడి స్వగ్రామం ఉప్పాలవారిపాలెం తీసుకెళ్తుండగా.. మండల కేంద్రం చెరుకుపల్లికి చేరుకుంది.  మృతుడి కుటుంబీకులు, బంధువులు అంబులెన్సును అడ్డుకొని అందులోంచి మృతదేహాన్ని కిందకు దించి ఆందోళన చేశారు. మృతదేహంతో స్టేషన్ వద్దకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా.. పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. వాటిని నెట్టుకొని ముందుకు వెళ్తుండగా.. పోలీసులు ఆందోళన కారుల్ని వెనక్కి నెట్టేశారు. దీంతో రేపల్లె ఎమ్మెల్యే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డు మీద కూర్చున్నారు. మిగిలిన ఆందోళన కారులు ఆయనతో పాు బైఠాయించి 2 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. 


విషయం తెలుసుకున్న ఆర్డీవో డీస్పీ, తహసీల్దార్ అక్కడకు చేరుకోగా.. స్పష్టమైన హామీ ఇవ్వాలని బాధితులు పట్టుబట్టారు. ఇప్పటికే ప్రభుత్వానికే కుటుంబ ఆర్థిక పరిస్థితిపై నివేదిక పంపామని, వారి అనుమతి మేరకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని, ఆందోళన విరమించాలని ఆర్డోవో పార్థ సారధి, డీఎస్పీ మురళీకృష్ణ కోరినా ససేమిరా అన్నారు. చివరకు అధికారులు ఎమ్మెల్యేతో పాటు మాట్లాడి కలెక్టర్ కు ఫోన్ చేయించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయంతో పాటు ఇల్లు కట్టిస్తామని, అమ్మాయి చదువు పూర్తికాగానే ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం ఆర్డీవో పార్థ సారథి ఆందోళన కారులకు చెప్పడంతో ఆందోళన విరమించారు.


అనంతరం బాలుడి మృతదేహాన్ని సొంతూరికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పాడె మోశారు. అమర్నాథ్ రెడ్డిని చంపిన నిందితులు నలుగురికి స్థానిక వైసీపీ నాయకుడు జెస్సీరెడ్డి అండదండలు ఉన్నాయని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. చెరుకుపల్లి రూరల్ సీఐ తన వద్దకు వచ్చే ఫిర్యాదు దారుల్ని.. ఏ పార్టీ అని అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.  హత్య చేసిన తర్వాత నిందితులు జెస్సీరెడ్డి ఇంటికి వెళ్లారని ఎమ్మెల్యే ఆరోపించారు. జెస్సీరెడ్డిని నిందితుల జాబితాలో చేర్చాలని ఎస్పీ వకుళ్ జిందాల్ ను కోరగా... అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. బాధిత కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 


ఎంపీపై గ్రామస్థుల మండిపాటు


పిల్లాడిని చంపి లక్ష రూపాయలు, ఉద్యోగం ఇస్తే మేమెలా తీసుకుంటామంటూ ఎంపీ మోపీదేవి వెంకట రమణారావుపై ఉప్పాలవారిపాలెం గ్రామస్థులు మండిపడ్డారు. అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించేందుకు వస్తే గ్రామస్థులు అడ్డుకున్నారు. వాళ్లను కలవనివ్వకుండా రహదారికి అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. దీంతో ఆయన వెంట ఉన్న స్థానిక వైసీపీ నానయకులు గ్రామస్థులకు నచ్చజెప్పి బాధిత కుటుంబీకులను అక్కడకు పిలిపించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తామని, ప్రభుత్వపరంగా రావాల్సిన సాయాన్ని అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత లక్ష రూపాయల నగదు తీసి బాధిత కుటుంబీకులకు ఇవ్వబోతుండగా.. అక్కడే ఉన్న బంధువులు మీ సాయం వద్దే వద్దని ఆ డబ్బు వెనక్కి ఇచ్చేశారు.