Bapatla Crime News: బాపట్ల జిల్లా కొల్లూరు మండలం క్రీస్తు లంక గ్రామానికి చెందిన శివపార్వతి మిషన్ కుడుతూ జీవనం సాగిస్తోంది. గురువారం రోజు సొంత పనిమీద చిలకలూరిపేటకు వెళ్లింది. తిరిగి తెనాలి చేరుకొనే సమయానికి బాగా చీకటి పడిపోయింది. అయితే గ్రామానికి వెళ్లేందుకు ఉన్న చివరి బస్సు కూడా వెళ్లిపోవడంతో.. ఆటోలో గ్రామానికి వెళ్లాలనుకుంది. ఈ క్రమంలోనే ఆటో కోసం తెనాలి మార్కెట్ సెంటర్ వద్దకు చేరుకుంది. తెనాలి నుండి క్రీస్తు లంక గ్రామానికి వెళ్లేందుకు ఆటోను మాట్లాడుకోగా.. ఒంటరిగా ఆటోలో బయలు దేరింది. తెనాలి పట్టణం దాటిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్ వ్యవహారం తేడాగా ఉండడం గమనించింది మహిళ. ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా బంధువులకు తెలియజేసింది.


వెళ్లాల్సిన దారిలో కాకుండా మరో చోటుకు..


కొంత దూరం వెళ్లిన తర్వాత వెళ్లాల్సిన దారిలో కాకుండా మరోవైపుకు ఆటోను తీసుకెళ్లాడు. గమనించిన మహిళ.. అరవడం ప్రారంభించింది. గట్టి గట్టిగా కేకలు వేస్తూనే తన వాళ్లకు చేసి చెప్పింది. కేకలు వేస్తే చంపేస్తానని ఆటో డ్రైవర్ బెదిరించాడు. దీంతో సదరు మహిళ ఫోన్ ఆఫ్ చేయకుండా అలాగే ఉంచడంతో.. ఆటో డ్రైవర్ మాటలన్నీ బంధువులు విన్నారు. ఇలా మహిళను బెదిరిస్తూనే కొల్లూరు మండం ముసలపాడు గ్రామ పొలాల్లోని కోళ్ల ఫారం వద్దకు తీసుకెళ్లాడు. ఎలాగైనా సరే శివ పార్వతిని కాపాడాలని ఆమె బంధువులు బైక్ పై బయలుదేరారు. మరోవైపు ఆటో డ్రైవర్.. ఆటోను కోళ్ల ఫారం వద్ద ఆపి మహిళను తీవ్రంగా కొట్టాడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద  ఉన్న రూ.30వేల నగదు, బంగారపు ఉంగరం తీసుకున్నాడు. అయితే మహిళ బందువులు వెతుకుతూ కోళ్ల ఫారం వద్ద ఆటోను గమనించి ఒక్క ఉదుటన అక్కడికి వచ్చారు. అయితే వారి రాకను గుర్తించిన ఆటో డ్రైవర్... ఆటో వదిలి పరార్ అయ్యాడు.


మహిళను తీసుకొని నేరుగా పీఎస్ కు వెళ్లిన బంధువులు


అప్పటికే బాధిత మహిళ శివ పార్వతి తీవ్ర గాయాలతో పడి ఉంది. ఆ యువకులు ఆమెను తీసుకోని నేరుగా  కొల్లూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. శివపార్వతి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. సమయానికి తన బంధువులు రాకపోయితే కచ్చితంగా అతడు తనను చంపేసేవాడని కన్నీటిపర్యంతం అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆటో డ్రైవర్ ను పట్టుకునే పనిలో పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడే నిందితుడి ఫొటో ఉన్న కీచైన్ కూడా ఉండడంతో దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది నిందితుడుని త్వరగా పట్టుకునేందుకు బాగా సహాయ పడుతుందని భావిస్తున్నారు. అలాగే నిందితుడిని త్వరగా పట్టుకుని.. బాధిత మహిళకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అనంతరం మహిళను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. అయితే శివ పార్వతి ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.