Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో దాదాపు నెల రోజులుగా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్‌ల విషయంలో ప్రభుత్వం పట్టుదలకు పోవడం వల్ల ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఏకంగా ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయే స్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా రాజీనామా చేసిన వెంటనే ఆందోళనకారులు సంబరాలు చేసుకున్నారంటే ఆమెపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే... అల్లర్లు అణిచివేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు వాదిస్తున్నారు. కానీ...ఈ విషయంలో షేక్ హసీనాకి బంగ్లాదేశ్ మిలిటరీ ఏ మాత్రం సహకరించలేదని స్పష్టమవుతోంది. Reuters వెల్లడించిన సమాచారం ప్రకారం హసీనా దేశం విడిచి వెళ్లిపోయే ముందు మిలిటరీ అధికారులతో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఆర్మీ జనరల్స్ ఆందోళనకారులపై కాల్పులు జరిపేందుకు అంగీకరించలేదు. షేక్ హసీనా చెప్పినట్టుగా లాక్‌డౌన్ విధించేందుకూ ఆసక్తి చూపించలేదు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు ఆమెకి వివరించారు. ఆర్మీ ఏ విధంగానూ ఆమెకి సపోర్ట్ ఇవ్వలేదు. ఫలితంగానే అప్పటికప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోక తప్పలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయిలో సైన్యం మద్దతుని కోల్పోయారు. పదిహేనేళ్ల పాటు ప్రజలు ఆమె పాలనలో ఎంత విసిగిపోయారానడానికి ఇదే నిదర్శనమని కొందరు విశ్లేషిస్తున్నారు.
జులై నుంచి ఈ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 91 మంది ప్రాణాలు కోల్పోయాక ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. అప్పటి నుంచి ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. అయితే..కొందరు ఆర్మీ అధికారులు దీనిపై మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ షేక్ హసీనా నియంతగా వ్యవహరించారు. ప్రతిపక్ష పార్టీ నేతలందరినీ జైల్లో పెట్టించారు. నాలుగోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్‌లు ఇస్తామని ప్రకటించారో అప్పటి నుంచి అల్లర్లు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడ నిరుద్యోగం పెరిగిపోతోంది. ఉన్న యువతను కాదని, బంగ్లాదేశ్ స్వాంతత్య్ర సమర యోధుల కుటుంబ సభ్యులకు 30% రిజర్వేషన్‌లు ఇస్తామని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగానే ఇంత సంక్షోభం తలెత్తింది. (Also Read: Bangladesh: అణిచివేసినా నిలదొక్కుకుని, అవమానాలు ఎదుర్కొని - బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రస్థానమిదే)
ఇటు ఆర్మీ కూడా సహకరించకపోవడం వల్ల చేసేదేమీ లేక దేశం విడిచి వెళ్లారు షేక్ హసీనా. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ పరిణామాలపై పార్లమెంట్‌లో ప్రసంగించారు. వీలైనంత వరకూ ఈ వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలిపారు. ప్రస్తుతానికైతే భారత్ ఆమెకి ఆశ్రయమిచ్చేందుకు అంగీకరించలేదు. అటు యూకే, అమెరికా కూడా షేక్ హసీనాపై ఆంక్షలు విధించాయి. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్ ఆమెకి రక్షణ కల్పించడంలో వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కి ఆపద్ధర్మ ప్రధానిగా మహమ్మద్ యూనస్ ఎన్నికయ్యారు. త్వరలోనే అక్కడ అల్లర్లకు అడ్డుకట్ట వేసి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నించనున్నారు.