Former Pithapuram MLA Dorababu Resigned from YCP :  ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్‌సీపీ నుంచి వరుసగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోతున్నారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా  చేస్తున్నట్లుగా ప్రకటించారు. పిఠాపురంలో ప్రెస్మీట్ పెట్టి వైసీపీలో తనకు ఎదురైన అవమానాలను వివరించారు. వైసీపీలో  తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ ర్యాంకింగ్స్‌ను ఇస్తామని చెప్పిన  గడపగడపకు ప్రచారంలో తానే ముందున్నా నని ఆయన వెల్లడించారు.  అయినప్పటికీ జగన్ నుండి తనకు ఎటువంటి గుర్తింపు రాలేదని కనీసం ఎన్నికల్లో తనను ప్రచారం చేయమని కూడా అడగలేదన్నారు. 


కార్యకర్తల నిర్ణయం మేరకే వైసీపీకి రాజీనామా                  


కార్యకర్తల అభీష్టం మేరకు వైసీపీని వీడుతున్నట్లు దొరబాబు ప్రకటించారు   ఇప్పటికే కూటమినేతలు తనతో టచ్ లో ఉన్నట్టు చెప్పిన దొరబాబు త్వరలో కూటమిలోని ఓ పార్టీలో  చేరుతున్నట్లు స్పష్టం చేశారు.  ఇది తన రాజకీయ స్వలాభం కోసం కాదని కార్యకర్తల అభీష్టం మేరకు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఒక ఆకాంక్షతో తాను పార్టీ మారుతున్నట్లు దొరబాబు స్పష్టం చేశారు  ఏ పదవి ఆశించడం లేదని కార్యకర్తలను తన అనుచరులను కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో పాటు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలన్న ఒకే ఒక ఆకాంక్షతో వైసీపీ నుండి వీడి కూటమిలోకి చేరుతున్నట్లు దొరబాబు వెల్లడించారు.


పిఠాపురం నుంచి రెండు సార్లు గెలిచిన దొరబాబు           


పెండెం దొరబాబు సీనియర్ నేత. మొదటి బీజేపీలో ఉండగా ఆయన 2004లో విజయం సాధించారు. అప్పట్లో టీడీపీ, బీజేపీ పొత్తుల్లో భాగంగా పోటీ చేశాయి. తర్వాత జరిగిన రాజకీయ పరిమామాల్లో ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు.  2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు. ఓ సారి ఓడిపోయి..మరోసారి గెలిచారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆయనకు అనుచరగణం ఉంది. అయితే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించడంతో.. దొరబాబు అభ్యర్థిగా అయితే తేలిపోతారని..కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. 


త్వరలో జనసేనలో చేరే అవకాశం                   


అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబును వైసీపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. కనీసం ప్రచారానికి కూడా పిలువలేదు. లదాంతో ఆయన ఎన్నికలకు ముందే పార్టీ మారిపోతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలోనే ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆయనకు ఆఫర్ ఇచ్చినా సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నా ప్రయోజనం లేదన్న క్లారిటీకి వచ్చి ఆయన జనసేన పార్టీతో సంప్రదింపులు జరిపారని..  చివరిగా గ్రీన్ సిగ్నల్ రావడతో వైసీపీకి రాజీనామా చేశారని అంటున్నారు. త్వరలోనే ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.