Kalki 2898 AD  4th Biggest Grosser in India: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన తెరకెక్కించి ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలై 40 రోజులు గడుస్తున్నా, వసూళ్ల పరంగా సత్తా చాటుతోంది. భారత్ తో పాటు విదేశాల్లోనూ ఈ మూవీ దుమ్మురేపుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా అవతరించింది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రాన్ని వెనక్కి నెట్టి మరీ ఈ ఘనత సాధించింది.


భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ చిత్రంగా ‘కల్కి 2898 AD’


‘కల్కి 2898 AD’ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్‌ గా నిలిచింది. జూన్ 27న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించి ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ అద్భుత ప్రేక్షకాదరణ దక్కించుకుంది. 2024లో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’, ‘KGF 2’, ‘RRR’ తర్వాత  అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా ‘కల్కి 2898 AD’ నిలిచింది. ఇండియాలో నాలుగో స్థానంలో ఉన్న ‘జవాన్’ను వెనకెక్కి నెట్టి ఆ స్థానాన్ని ఈ సినిమా కైవసం చేసుకుంది.  


‘జవాన్’ మూవీ లాంగ్ రన్ లో మొత్తంలో రూ.640.25 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇండస్ట్రీ కలెక్షన్స్ ట్రాకర్ సాక్‌నిల్క్ ప్రకారం, 41వ వరకు ‘కల్కి 2898 AD’ రూ. 640.38 కోట్లను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం ‘జవాన్’ నెట్, గ్రాస్ కలెక్షన్స్ కంటే ముందుంది. మొదటి వారంలో ‘కల్కి 2898 AD’ రూ. 414.85 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో రూ.128.5 కోట్లు, మూడో వారంలో రూ.56.1 కోట్లు, నాలుగో వారంలో రూ.24.4 కోట్లు, ఐదో వారంలో రూ.12.1 కోట్లతో వసూళ్లు అందుకుంది. ఆరో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం శుక్రవారం రూ.65 లక్షలు, శనివారం రూ.1.35 కోట్లు, ఆదివారం రూ.1.85 కోట్లు వసూలు చేసింది. సోమవారం రూ. 50 లక్షలను అందుకుంది. మొత్తం దేశీయ కలెక్షన్ రూ. 640.15 కోట్లకు చేరుకున్నట్లు సాక్‌నిల్క్  వెల్లడించింది. ‘జవాన్’ థియేట్రికల్ రన్ ఎనిమిది వారాలపాటు కొనసాగగా, ‘కల్కి 2898 AD’ ఇంకా ఆరవ వారంలోనే ఉంది.


ఆగష్టు 15 తర్వాత ‘కల్కి 2898 AD’ వెనుకబడేనా? 


ఆగష్టు 15న ‘స్త్రీ 2’, ‘వేదా’, ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలు విడుదలకానున్నాయి. మరో వారం రోజుల పాటు ‘కల్కి 2898 AD’ వసూళ్లు కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ‘డెడ్‌పూల్ & వుల్వరైన్’ నుంచి పోటీని ఎదుర్కొంటోంది.  


‘కల్కి 2898 AD’ గురించి..


‘కల్కి 2898 AD’ సినిమాను భారతీయ ఇతిహాసానికి ఆధునికత జోడించి తెరకెక్కించారు నాగ్ అశ్విన్. మూడు సరికొత్త లోకాలను క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో  అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో కనిపించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.  



Also Read: అందుకే టాప్ లేకుండా నటించాల్సి వచ్చింది, చాలా బాధపడ్డా: నటి అను అగర్వాల్