Ban Halal Meat in Karnataka:


యాంటీ హిలాల్ చట్టం..


కర్ణాటక ప్రభుత్వం సంచలన బిల్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో... హలాల్‌ మాంసాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే బిల్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే...దీనిపై పెద్ద ఎత్తున రగడ జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. FSSAI తప్ప మరే సంస్థ ధ్రువీకరించిన ఆహారాన్నైనా నిషేధించాలని సూచించారు. ఈ ఏడాది మార్చిలోనే హలాల్ మాంసంపై పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఉగాది పండుగ సమయంలో పలు హిందుత్వ సంస్థలు హలాల్ మాంసాన్ని నిషేధించాలని నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలోనే చట్ట పరంగా నిషేధం విధించాలని ప్రభుత్వానికి పలువురు నేతలు సూచించారు. ఇప్పుడు బీజేపీ నేత రవికుమార్...అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్స్ బిల్స్‌లో భాగంగా ఈ బిల్‌ను ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే దీనిపై గవర్నర్ థావర్‌చంద్ గహ్లోట్‌కు లేఖ కూడా రాశారు. ఇప్పుడు అసెంబ్లీలో అధికారికంగా ఆ బిల్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైను కలవనున్నారు రవి కుమార్. "కొన్ని అనధికారిక సంస్థలు ఆహార పదార్థాలకు అక్రమంగా ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నాయి. ఈ బిల్ ద్వారా అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది" అని వెల్లడించారు. ఇప్పటికే...ఈ అంశంపై అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. గత సెషన్‌లో యాంటీ కన్వర్షన్‌ బిల్‌పై కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా అదే వేడి కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోపు యాంటీ హలాల్ చట్టాన్ని తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే...ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల్లో ఇదీ చేరిపోతుంది. 


సావర్కర్‌  ఫోటోపై రగడ..


కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నేత సిద్దరామయ్యతో పాటు మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫోటోను ఉంచడాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బీజేపీపై మండి పడ్డారు. సభ సజావుగా సాగకూడదన్న దురుద్దేశంతోనే...ఇలా సావర్కర్ ఫోటోను అసెంబ్లీలో పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి గురించి పదేపదే ప్రశ్నిస్తున్నామన్న అక్కసుతో...ఆ అంశాన్ని దారి మళ్లించేందుకు ఇలా కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభివృద్ధి ఎజెండా లేనేలేదని ఆరోపించారు.  సిద్దరామయ్య, వాల్మీకి, బసవన్న, కనక దాస్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు...
అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. సావర్కర్ ఫోటోని అసెంబ్లీలో ఉంచడాన్ని వ్యతిరేకించారు. నిజానికి..చాలా రోజులుగా సావర్కర్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్నా...ఇప్పుడు మరోసారి అసెంబ్లీ వేదికగా మొదలైంది. ప్రస్తుతం బీజేపీ కర్ణాటకలో హలాల్ వివాదంపై రాజకీయం చేస్తోంది. దీనిపై భావోద్వేగాలు ప్రారంభమయ్యాయి. 


Also Read: కొవిడ్ తరవాత పిల్లలు చదవడం రాయడం పూర్తిగా మర్చిపోయారు - సర్వే