Elon musk Twitter Poll: గ్లోబల్‌ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కొంటానని ఈ ఏడాది (2022) ఏప్రిల్‌లో ప్రకటించిన దగ్గర నుంచి తరచుగా ఏదోక వివాదంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon musk) వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను ఆయన చేజిక్కించుకున్నారు. ట్విట్టర్‌ టాప్‌ ఛైర్‌లో కూర్చోవడానికి రెండు రోజుల ముందే తనను తాను హెడ్‌ ట్విట్‌గా పరిచయం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌, తన ట్వీట్ల ద్వారా ప్రపంచ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. 


ట్విట్టర్‌ హెడ్‌ పదవికి రాజీనామా చేయాలా?
ఇప్పుడు, మరో సంచలన ట్వీట్ చేశారు ఎలాన్‌ మస్క్‌. సోషల్ మీడియా సైట్ హెడ్ పదవి నుంచి తాను తప్పుకోవాలా అని ప్రశ్నిస్తూ, మస్క్ ఇవాళ (సోమవారం, డిసెంబర్ 19, 2022) ఒక ట్వీట్‌ చేశారు. సమాధానం చెప్పమంటూ ట్విట్టర్ ఖాతాదారులను కోరారు.


పోల్‌ ఫలితం ఏమిటి?
ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేసిన అరగంటలోనే 61 లక్షల 92 వేల 394 ఓట్లు పోలయ్యాయి. 57.6 శాతం పైగా వినియోగదారులు 'యస్‌' (ట్విట్టర్‌ హెడ్‌ పదవి నుంచి ఎలాన్‌ మస్క్‌ తప్పుకోవాలి) అని సమాధానం ఇచ్చారు. 42.4 శాతం మంది 'నో' (ట్విట్టర్‌ హెడ్‌ పదవిలో ఎలాన్‌ మస్క్‌ కొనసాగాలి) బటన్‌ను క్లిక్ చేశారు.


ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకుందాం. ఇటీవల, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ హ్యాండిల్‌ను పునరుద్ధరించడానికి ఒక పోల్‌ పెట్టారు మస్క్‌. మెజారిటీ ప్రజల నిర్ణయం ప్రకారం, ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. ఇప్పుడు కూడా, మెజారిటీ ప్రజల తీర్పు ప్రకారమే ఎలాన్‌ మస్క్‌ నడుచుకుని, ట్విట్టర్‌ హెడ్‌ పదవి నుంచి దిగిపోతారా, లేక, అలవాటు ప్రకారం మాట తప్పుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. నెటిజన్లలో ఈ టాపిక్కే ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది.


జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు సస్పెన్షన్‌
ఇటీవల, వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్‌ సహా మరికొందరు జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను కూడా ఎలాన్ మస్క్ సస్పెండ్ చేశారు. తన వ్యక్తిగత విమానం ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు వెల్లడించడం ద్వారా తన కుటుంబాన్ని, వాళ్ల జీవితాలను ఆ జర్నలిస్ట్‌లు ప్రమాదంలో పడేశారని మస్క్‌ ఆరోపించారు. ఈ చర్య మీద కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. దీని మీద యూరోపియన్ యూనియన్ కూడా జోక్యం చేసుకుంది. భవిష్యత్తులో, మీడియా చట్టం నిబంధనలకు ట్విట్టర్ లోబడి  ఉండాల్సి వస్తుందని మస్క్‌ని హెచ్చరించింది.


ట్విట్టర్‌ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 13న రీలాంచ్ అయింది. ప్రస్తుతం ఈ సర్వీస్ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో ప్రారంభం అయింది. త్వరలో భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలోని iOS వినియోగదారుల కోసం ఈ సబ్‌స్క్రిప్షన్ ధరను ఒక టిప్‌స్టర్ లీక్ చేశారు. iOS యాప్ స్టోర్‌లో కొత్త ట్విట్టర్ బ్లూ ధర రూ. 999 అని ట్వీట్ చేశాడు. అయితే, ఇప్పటి వరకు ఈ సేవను మన దేశంలో ప్రారంభించలేదు కాబట్టి, ధరకు సంబంధించిన వివరాలను ఆ కంపెనీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.