Hyderabad Balapur Ganesh Laddu Auction 2023: హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్‌ గణపతి ఎంత ఫేమస్సో... బాలాపూర్‌ లడ్డూ వేలం కూడా అంతే ఫేమస్. అందుకే గణేష్‌ నిమజ్జనం టైంలో బాలాపూర్ లడ్డూ ఎవరు పాడారు. ఎంతకు పాడారు అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతూ ఉంటుంది. 

ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ కోసం భక్తులు పోటీ పడ్డారు. గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించిందీ లడ్డూ. 30వసారి జరిగిన లడ్డూ వేలాం ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది బాలాపూర్‌ గణేష్ లడ్డూ వేలంపాటలో 36 మంది భక్తులు పాల్గొన్నారు. 

గతేడాది 24 లక్షల 60 వేల రూపాయలు పలికితే ఈసారి అంతకు మించిపోయింది. 27 లక్షల రూపాయలకు తుర్కయాంజల్‌కు చెందిన  దాసరి దాయనంద్ రెడ్డి దక్కించుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వేలాంపాటలో పాల్గొనాలనే వాళ్లంతా ఉత్సవ కమిటీకి ముందుగానే ఇవ్వాలని తీర్మానించారు.     

గతేడాది లడ్డూ దక్కించుకున్న లక్ష్మారెడ్డి   

గతేడాది ఈ లడ్డూ 24 లక్షల 60 వేలు చెల్లించి వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. ఈయన ఈసారి కూడా వేలంలో పాల్గొన్నారు. గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో 9 మంది పాల్గొన్నారు. లడ్డూను దక్కించుకునేందుకు ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడ్డారు. వీరిలో జక్కిడి శివచరణ్ రెడ్డి, దాసరి దయానంద్ రెడ్డి, ఎర్ర జయిం, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొణతం ప్రకాశ్ రెడ్డి, నవారి శ్రీనివాస్ రెడ్డి, వొంగేటి లక్ష్మారెడ్డి, కొలను శంకర్ రెడ్డి తదితరులు వేలం పాటలో పాల్గొన్నారు. 

తొలుత నిర్వహకులు లడ్డూ ధరను 5 లక్షల నుంచి ప్రారంభించారు. బాలాపూర్ లడ్డూ ధరను వేలం పోటీలో పాల్గొన్న వారు అమాంతం పెంచుకుంటూ పోయారు. చివరకు 24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు.

గణేష్ లడ్డూ వేలం అనగానే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెంటనే గుర్తుకు వచ్చేది బాలాపూర్ మాత్రమే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు బాలాపూర్ గ్రామంలో నగరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూను వేలం వేయడాన్ని మొదట ప్రారంభించింది అక్కడే. మొదట కొంత మొత్తం ధరతో లడ్డూను సొంతం చేసుకున్నారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ.. బాలాపూర్ లడ్డూ వేలం ధర వేలు, 10 వేలు, లక్షలు దాటి పదుల లక్షల్లోకి వచ్చేసింది. ప్రతి సంవత్సరం దాని రికార్డును అదే బద్దలు కొట్టుకుంటోంది. బాలాపూర్ లడ్డూ వేలంలో దక్కించుకున్న వారు తమకు చాలా మంచి జరుగుతోందని బలంగా నమ్ముతున్నారు. అది వారికి, వారి కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు మేలు జరుగుతోందని విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసం క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా పాకింది. బాలాపూర్ లడ్డూను ఎలాగైన సొంతం చేసుకోవాలన్న కాంక్ష పెరిగి పోయింది. ఇందుకోసం లక్షలాది రూపాయలు సైతం వెచ్చించడానికి వెనకాడటం లేదు. 

ఇప్పటి వరకు లడ్డూ దక్కించుకున్న వ్యక్తులు 

సంవత్సరం  దక్కించుకున్న వ్యక్తులు పాడుకున్న ధర 
1994  కొలను మోహన్ రెడ్డి రూ. 450 
1995 కొలనుమోహాన్ రెడ్డి   రూ.4500 
1996 కొలను కృష్ణారెడ్డి  రూ.18 వేలు
1997  కొలను కృష్ణారెడ్డి  రూ.28వేలు
1998  కొలను మోహన్ రెడ్డి  రూ. 51వేలు
1998 కళ్లెం ప్రతాప్ రెడ్డి  రూ.65వేలు
1999  కళ్లెం అంజిరెడ్డి  రూ.66వేలు
2000  జి. రఘునందన్ చారి  రూ.85వేలు
2001 కందాడ మాధవరెడ్డి  రూ.1.05లక్షలు
2002 చిగురంత తిరుపతిరెడ్డి  రూ.1.55లక్షలు
2003 కొలను మోహన్ రెడ్డి  రూ.2.01లక్షలు
2004 ఇబ్రహీం శేఖర్  రూ.2.08లక్షలు
2005 చిగురంత తిరుపతి రెడ్డి  రూ.3 లక్షలు
2006 జి.రఘునందన్ చారి  రూ.4.15లక్షలు
2007  కొలను మోహన్ రెడ్డి  రూ. 5.07 లక్షలు
2008 సరిత రూ.5.10లక్షలు
2009 కొడలి శ్రీధర్ బాబు  రూ. 5.35లక్షలు
2010 కొలను బ్రదర్స్   రూ. 5.45లక్షలు
2011  పన్నాల గోవర్థన్  రూ. 7.50లక్షలు
2012 తీగల కృష్ణారెడ్డి  రూ.9.26లక్షలు
2013 సింగిరెడ్డి జైహింద్ రెడ్డి  రూ. 9.50లక్షలు
2014 కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి  రూ. 10.32 లక్షలు
2015 స్కైలాబ్ రెడ్డి  రూ. 14.65లక్షలు
2016 నాగం తిరుపతి రెడ్డి  రూ.15.60 లక్షలు
2017   తిరుపతిరెడ్డి రూ. 15 లక్షల 60 వేలు
2018   శ్రీనివాస్‌ గుప్తా  రూ. 16 లక్షల 60 వేలు 

2019 కొలను రాంరెడ్డి రూ.17.60 లక్షలు

2021 మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్ రూ. 18.90 లక్షలు

2022
 వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24 లక్షల 60 వేలు

2023 దాసరి దయానంద్‌ రెడ్డి రూ. 27 లక్షలు

కరోనా కారణంగా 2020లో వేలాం పాట నిర్వహించలేదు.