Baba Ramdev's Remarks: 


యోగాను ప్రచారం చేసుకోండి..అలోపతిని తిట్టొద్దు: సుప్రీం కోర్టు 


బాబా రాం దేవ్ అలోపతి వైద్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం...కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయుర్వేదాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, కానీ...ఇతర వైద్య విధానాలను విమర్శించటం సరికాదని మండి పడింది. "రాం దేవ్ బాబా అలోపతి వైద్యులపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నట్టు..? ఆయన వల్లే యోగా పాపులర్ అయింది. ఇది మంచి విషయమే. కానీ...ఇతర వైద్య విధానాలను విమర్శించటం దేనికి..? ఆయన అనుసరిస్తున్న వైద్య విధానంతో జబ్బులు పూర్తిగా నయమైపోతాయని గ్యారెంటీ ఉందా..? " అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA)దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలోపతి వైద్యాన్ని, కొవిడ్ వ్యాక్సినేషన్‌ను విమర్శించటమే లక్ష్యంగా రామ్ దేవ్ బాబా ప్రచారం చేస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతేడాది సెకండ్‌ వేవ్ సమయంలో భారత్ ఎంత సతమతమైందో చూశాం. అయితే ఓ సందర్భంలో రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "అలోపతి వైద్యం వల్లే లక్షలాది మంది మృతి చెందారు. చాలా మందికి సరైన వైద్యం, ఆక్సిజన్ దొరకలేదు" అని అన్నారు. ఆ సమయంలోనే చాలా సార్లు అలోపతి వైద్యంపై ఇలానే విమర్శలు చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్  తీసుకున్న వారు కూడా కరోనా వచ్చి చనిపోయారని ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన
IMA..ఆయనపై Epidemic Diseases Act కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖకు విన్నవించింది. 


అలోపతియే ఆయన టార్గెట్..


అలోపతి వైద్యం...మానవత్వానికి వ్యతిరేకమని ఇటీవల సంచలన కామెంట్స్ చేశారు బాబా రాందేవ్. మానవత్వాన్ని కాపాడుకోవాలంటే, ప్రపంచమంతా యోగావైపు మళ్లాలని అన్నారు. భారత సంస్కృతిలో భాగమైన నేచురోపతి, ఆయుర్వేద వైద్యాన్ని అనుసరించాలని 
సూచించారు. "నేచురల్ మెడిసన్, నేచురల్ హర్బ్స్, నేచురల్ ఫుడ్‌ను ఓ మతానికి ఆపాదించటం సరికాదు. ఇప్పుడివి ప్రపంచానికి ఎంతో అవసరం" అని చెప్పారు రామ్‌ దేవ్ బాబా. ఆయన సన్నిహితుడు, పతంజలి యోగపీఠ్ కోఫౌండర్ ఆచార్య బాలకృష్ణ 50వ పుట్టిన రోజు 
సందర్భంగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌లో ఈ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆచార్య బాలకృష్ణ నేతృత్వంలో యోగ్‌పీఠ్ ఎంతో మందికి మెరుగైన వైద్యం అందిస్తోందని, మొండి జబ్బులనూ నయం చేస్తోందని ప్రశంసించారు. "అలోపతి వైద్యులు టార్గెటెడ్ మెడిసిన్ తయారు చేస్తున్నారు. మెదడు, కాలేయం, కిడ్నీలు, గుండె,ఎముకలు...ఇలా అన్ని అవయవాలకు ప్రత్యేకంగా మందులు ఇస్తారు. కేవలం ఒకే ఒక మందుతో జబ్బుని ఎలా నయం చేస్తారు..? ఇలాంటి వాళ్లు అవివేకులు. ఆధునిక వైద్యం ఇంకా పసిప్రాయంలోనే ఉంది. వాళ్లు చేసిన పనులేవీ ఆమోదయోగ్యమైనవి కావు. ఒకే ఒక ప్రోటీన్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆరోగ్యంగా మార్చేస్తాం అనటం అవివేకం" అని అన్నారు రామ్ దేవ్ బాబా. ప్రపంచ వైద్య రంగం ఇప్పుడు శీర్షాసనం వేస్తోందని, టార్గెటెడ్ మెడిసిన్‌తో ప్రజల్ని అమాయకులుగా మార్చుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏదో రెండు, మూడు జబ్బులకు తప్ప..యోగాలో అన్ని వ్యాధులకు మందు ఉందని స్పష్టం చేశారు. 


Also Read: MLA Raja Singh Suspension: బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ - వీడియో రిలీజ్ చేయడమే కారణం !


Also Read: Nellore రైల్వే ట్రాక్ మధ్య దర్గా | India లోనే ఇదో అరుదైన దర్గా | DNN | ABP Desam