MLA Raja Singh Suspension:  వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యేపై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో పది రోజుల్లో చెప్పాలని ఆదేశిచింది. రాజాసింగ్‌ను ఈ ఉదయమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అత్యంత వివాదాస్పదమైన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. దానిపై రాత్రికి రాత్రే తీవ్ర దుమారం రేగింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి... యూట్యూబ్ నుంచ ఆ వీడియోను తొలగింప చేశారు. వెంటనే రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అది పార్ట్ వన్ మాత్రమేనని.. అసలు సినిమాను యూట్యూబ్‌లో పెడతానని ఆయన హెచ్చరించారు.


 


నుపుర్ శర్మ తరహా వివాదాన్ని తెచ్చి పెట్టిన రాజాసింగ్ 


ఇటీవల బీజేపీకి చెందిన నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు అలాంటి  పరిస్థితినే రాజాసింగ్ తీసుకు వచ్చారు.  దీంతో  బీజేపీ హైకమాండ్ ఏ మాత్రం ఆలస్యం  చేయకుండా స్పందించి సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వీడియో విషయంలో దేశవ్యాప్తంగా రాజాసింగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. 



మునావర్ ఫారుఖీ షోకు పర్మిషన్ ఇచ్చినందుకు నిరసన 


ఇటీవల హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆయన గతంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ స్టాండప్ కామెడీ చేశారని..  అందుకే ప్రదర్శనకు అంగీకరించబోమన్నారు. అయితే కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం మీద మునావర్ షో ఇవ్వడానికి వచ్చినందున పోలీసులు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని షోను సక్సెస్ చేశారు. రెండు రోజుల పాటు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అయితే తమ కార్యకర్తలు టిక్కెట్లు కొన్నారని.. మునావర్‌ను కొడతామని .. వేదికను తగులబెడతామని హెచ్చరించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. 


బిస్తర్ పట్టుకుని పాదయాత్రకు వచ్చేయండి - తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపు !


ఉద్దేశపూర్వకంగా వీడియో పోస్ట్ చేసిన రాజాసింగ్ 


మునావర్ షోకు అనుమతి తాను చేయాల్సింది చేస్తానని ఆయన హెచ్చరించారు. ఆ ప్రకారం.. వీడియోను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయంగా  ఈ వీడియో..  భారత్‌కు చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. ఓ వర్గం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉండంతో పోలీసులు వేగంగా స్పందించారు.  వీడియోను తీసేయించినా ఈ విషయం  మాత్రం వైరల్ అయింది. 


వేగంగా స్పందించి  పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ 


ఇటీవల ఇలాంటి వివాదంలోనే నుపుర్ శర్మతో పాటు మరో నేను బీజేపీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వారి వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా  భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో వారిని తప్పించారు. ఇప్పుడు అదే తప్పు రాజాసింగ్ చేశారు. అయితే.. తనకు పార్టీ ముఖ్యం కాదని.. రాజాసింగ్ చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆయనను పార్టీ సస్పెండ్ చేయడంతో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.