Congress Focus on Munugodu: తెలంగాణలో రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. తరచూ ఉప ఎన్నికలు రావడంతో రాజకీయ యుద్ధం నిత్యం కొనసాగుతూనే ఉంది. మొన్నటి హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంలో రాజకీయం అంతా ఆ నియోజకవర్గం చుట్టూనే జరగ్గా.. ఇప్పుడు మునుగోడు వంతు వచ్చేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలా రాజీనామా చేయగానే ఇలా ప్రచారాలు ప్రారంభం అయ్యాయి. అసలు నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. 


మునుగోడు రాజకీయ కాక


ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మునుగోడులో అందరికంటే ముందే భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారానికి శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా అటు బీజేపీపై, ఇటు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ పార్టీ అత్యంత కీలకనేత అయిన అమిత్ షా మునుగోడు సభలో పాల్గొన్నారు. అసలు షెడ్యూల్ రాక ముందే అన్ని పార్టీలు యుద్ధ ప్రారంభించాయి. 


ఈ నెలాఖరుకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు! 


కాంగ్రెస్ పార్టీకి మునుగోడు సిట్టింగ్ స్థానం. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మునుగోడు స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని అనుకుంటోంది కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల ముఖ్యనేతలు మునుగోడు ప్రచారంలో పాల్గొనగా.. కాంగ్రెస్ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఓసారి సభను ఏర్పాటు చేసింది రాష్ట్ర కాంగ్రెస్. నియోజకవర్గంలో లక్షమంది పాదాభివందన కార్యక్రమం కూడా చేపట్టింది. ఇప్పుడు అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టింది. అభ్యర్థి ఎంపికపై ఇవాళ్టి నుంచి ముఖ్య నేతలతో సంప్రదింపులు జరపనుంది.  ఈ నెలాఖరులోగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఎంపీ, పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయం తీసుకోమని ప్రియాంక సూచించిట్లు తెలుస్తోంది. 


ప్రజల్లోకి కాంగ్రెస్ నాయకులు


కరోనా నుంచి కోలుకున్న రేవంత్ రెడ్డి.. పలు రోజులుగా మునుగోడులోనే మకాం వేశారు. 'మన మునుగోడు -  మన కాంగ్రెస్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యానికి పాదాభివందనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తనతో సహా వెయ్యి మంది నాయకులు ఒక్కో నాయకుడు వంద మంది ఓటర్లకు వందనం చేస్తూ ఓట్లు అడగాలని నిర్దేశించుకున్నారు. 'మన వెయ్యి మంది నాయకులు లక్ష మందికి పాదాభివందనం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేయబోతున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 


మునుగోడు గెలిచి తీరాలి


మునుగోడు ఉపఎన్నికను అటు అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మునుగోడు బై పోల్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమిని, మునుగోడు ఫలితంతో మరుగున పడేలా చేసేందుకు అధికార గులాబీ దళం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధం అయింది. మునుగోడు ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసి బీజేపీలోనూ కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విజయం సాధిస్తారన్న ధీమా పార్టీలో కనిపిస్తోంది. ఇప్పుడే ఈ స్థాయిలో ప్రచార పర్వం. నోటిఫికేషన్ విడుదలై, షెడ్యూల్ వచ్చిన తర్వాత మరింత పెరిగే అవకాశం మాత్రం మెండుగా ఉంది.