Ayodhya Ram Mandir:
2024 సంక్రాంతికి...
భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 50% పనులు పూర్తైనట్టు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. 2024 జనవరిలో మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించి...భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరవనున్నట్టు తెలిపింది. రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Ram Janmabhoomi Teerth Kshetra Trust)జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఇందుకు సంబంధించి మరి కొన్ని వివరాలు వెల్లడించారు.
"మరో వెయ్యేళ్ల పాటు ఈ ఆలయం నిలిచిపోతుంది. భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలబడుతుంది" అని స్పష్టం చేశారు. మొత్తం 1800 ఎకరాల్లో ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయానికి 392 స్తంభాలు, 12 ద్వారాలు ఉంటాయి. ఐరన్ రాడ్స్ వినియోగించ కుండానే...వీటి నిర్మాణం కొనసాగుతోంది. రాళ్లను అనుసంధానించటానికి ఐరన్ రాడ్స్ బదులుగా...కాపర్ చిప్స్‌ను వినియోగిస్తున్నారు.
గర్భగుడిలో 160 స్తంభాలుంటాయి. మొదటి అంతస్తులోనే 82 పిల్లర్స్ ఉంటాయని ట్రస్ట్ తెలిపింది. మొత్తం 12 ప్రవేశ ద్వారాలు అందుబాటు లోకి వస్తాయి. ప్రధాని మోదీ సూచన మేరకు..."అయోధ్య రామ మందిరం పనులు ఎలా కొనసాగుతున్నాయి" అనే అంశంపై స్థానికంగా సర్వే చేపట్టారు. ఆలయానికి 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను ఆరా తీశారు. "పనుల వేగం, నాణ్యత మాకెంతో సంతృప్తినిస్తోంది" అని ప్రజలు ఆ సర్వేలో చెప్పినట్టు తేలింది. రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గ్రనైట్ రాళ్లను ఆలయ నిర్మాణంలో వినియోగిస్తున్నారు. రామనవమి రోజున రాముడి విగ్రహంపై సూర్య కిరణాలు పడేలా...నిర్మాణం చేపడుతున్నట్టు ప్రాజెక్ట్ మేనేజర్ వెల్లడించారు.
ఆదిత్యనాథ్ శంకుస్థాపన..
ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించిన పనులకు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 11 మంది అర్చకులు పూజలు జరిపారు. రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఆదిత్యనాథ్ విడుదల చేశారు. అంతకుముందు రామమందిర నిర్మాణం చేపట్టిన ఇంజినీర్లను సీఎం సత్కరించారు. 2023 డిసెంబర్‌లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. 2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది.
ప్రత్యేకతలు
1. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
2. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉంటుంది.
3. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది.
4. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
5. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని బన్సీ పహార్‌పూర్‌లోని ఇసుకరాళ్లను ఆలయ ప్రధాన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు.
Also Read: Hijab Ban Controversy: హిజాబ్ ధరించిన మహిళ భారత్‌కు ప్రధాని కావాలి - అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్