కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు కూడా అప్రమ్తమవుతున్నాయి. అనవసరంగా కేరళ ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచిస్తున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం సర్య్కులర్‌ జారీ చేసింది. కేరళలో వైరస్‌ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించింది. అలాగే కేరళతో సరిహద్దు జిల్లాలైన కొడగు, దక్షిణ కన్నడ, చామరాజనగర, మైసూర్‌ లో భద్రత కట్టుదిట్టం చేయాలని, నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. కేరళలో నిఫా వైరస్‌ కారణంగా ఇప్పటికే ఆరుగురు చనిపోయిన నేపథ్యంలో వ్యాధి సంక్రమణను అడ్డుకోవడానికి వైరస్‌ ప్రభావిత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ఎవ్వరినీ రాకుండా చూడాలని, అలాగే కర్ణాటక నుంచి అక్కడికి ఎవ్వరూ వెళ్లొద్దని ప్రభుత్వం వెల్లడించింది.


రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా నిఫా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెడికల్‌ అధికారులను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. గురువారం ఈ మేరకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అడ్వైజరీని విడుద చేసింది. అన్ని మెడికల్‌ కళాశాలల ప్రిన్సిపల్స్, అన్ని జిల్లాల చీఫ్‌ మెడికల్‌, హెల్త్‌ ఆఫీసర్స్‌ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళలో నిఫా వైరస్‌ మరణాలు నమోదమవుతున్నందున అధిక జాగ్రత్త వహించాలని పేర్కొంది.


కేరళలో బయటపడ్డ నిఫా వైరస్‌లో రకాన్ని బంగ్లాదేశ్‌ వేరియంట్‌గా అధికారులు గుర్తించారు. 2018 లో నిఫా వైరస్‌ ప్రబలినంత తీవ్రంగా ఈసారి పరిస్థితులు ఉండవని, మరీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని కేరళ మాజీ ఆరోగ్య మంత్రి, సీనియర్‌ సీపీఐ(ఎం) నేత, ఎంఎల్‌ఏ కేకే శైలజ తెలిపారు. పరిస్థితిని కంట్రోల్‌కి తీసుకురావడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇతర ప్రాంతాలకు వైరస్‌ వ్యాపించకుండా తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మొదట నిఫా వైరస్‌ ప్రబలినప్పుడు శైలజ అప్పటి ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.


వైరస్‌ వ్యాప్తి అడ్డుకునేందుకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణాను మూసేసింది. 153 హెల్త్‌ వర్కర్స్‌తో పాటు సుమారు 706 మందికి ఈరోజు సాయంత్రం పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ప్రభావిత ప్రాంతాల్లో పరీక్షలు కొనసాగిస్తామని మంత్రి వీణా జార్జి వెల్లడించారు. కేరళ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఐసీఎంఆర్ గురువారం కోజికోడ్‌కు BSL-3(Biosafety level-3) మొబైల్‌ ల్యాబరేటరీని పంపించింది. జిల్లాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. గతంలో  పంపిన 11 మందికి నమూనాలకు నెగిటివ్‌ రిజల్ట్‌ రావడం కాస్త రిలీఫ్‌గా ఉంది.


గబ్బిలాలు, పందులు, వైరస్ వల్ల కలుషితమైన ఆహారం తీసుకుంటే మానవులకు ఇది వ్యాపిస్తుంది. నేరుగా మనిషి నుంచి మనిషికి కూడా సంక్రమిస్తుంది. భారత్ లో ఈ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించింది. ఇప్పటి వరకు నిఫా వైరస్ కు ఎలాంటి మందులు అందుబాటులో లేవు. దీన్ని నివారించాలంటే భద్రతా చర్యలు అనుసరించాలి. వైరస్ సోకిన జంతువుల అవశేషాలు ముట్టుకోకుండా వాటిని తగులబెట్టాలి. వాటి మృతదేహాలు కాల్చడం చేయాలి. చాలా మంది వ్యక్తులు దీని నుంచి పూర్తిగా కోలుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం ఎన్సెఫాలిటిస్ వస్తే నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సార్లు తగ్గినా మళ్ళీ వైరస్ సోకినట్టుగా వచ్చిన కేసులు నివేదించబడ్డాయి. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం వీటి మరణాల రేటు 40-75 శాతంగా ఉంది. తీవ్రమైన సందర్భాల్లో ప్రజలు న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు అనుభవిస్తారు. ఎన్సెఫాలిటిస్ వస్తే మాత్రం 24 గంటల నుంచి 48 గంటల్లో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.