రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు బాంబుల వర్షం కురిపిస్తున్నారు. కొంతకాలంగా రష్యా భూభాగంలోకి వెళ్లే...దాడులకు దిగుతోంది ఉక్రెయిన్ సైన్యం. తాజాగా మాస్కోకు చెందిన అధునాతన గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌, నౌకాదళం కలిసి.. క్రిమియా పశ్చిమాన ఉన్న రష్యన్ స్థావరంపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసినట్లు కీవ్‌ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఎస్‌300, ఎస్‌400 గగనతల రక్షణ వ్యవస్థల ధ్వంసం చేసింది. దీని విలువ 9 వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తోంది. 


క్రిమియాలో రాత్రికి రాత్రే 11 ఉక్రెయిన్‌ డ్రోన్‌లను కూల్చేసినట్లు రష్యా తెలిపింది. నల్ల సముద్రంలో ఓ ఉక్రెయిన్‌ బోట్‌ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. రష్యా- అమెరికాల మధ్య ఘర్షణాపూరిత వాతావరణం మరింత వేడెక్కేలా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన ఇద్దరు దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు రష్యా విదేశాంగశాఖ తాజాగా ప్రకటించింది. ఆతిథ్య దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఆమోదయోగ్యం కాదని, వాటిని అణిచివేస్తామని రష్యా స్పష్టం చేసింది.


మరోవైపు యుద్ధంలో రష్యాకు బహిరంగంగా మద్దతునిచ్చారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్. దుష్ట శక్తులను శిక్షించే పోరాటంలో.. రష్యా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా తన సార్వభౌమాధికారం, దేశ భద్రతను కాపాడుకోడానికి ఆధిపత్య శక్తులకు వ్యక్తిరేకంగా నిలబడిందని ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు క్రెమ్లిన్ అధినేత వ్లాదిమిర్​ పుతిన్​తో...కిమ్ జోంగ్ ఉన్​ తన మనసులోని మాటను చెప్పారు. ఇరు దేశాధినేతలు రష్యాలోని వాస్టోచ్నీ కాస్మోడ్రోమ్​ రాకెట్​ ప్రయోగ కేంద్రంలో భేటీ అయ్యారు. కిమ్‌.. రష్యా పర్యటనపై అనేక అంచనాలు నెలకొన్నాయి. భారీ అణు ఆయుధాగారాన్ని నిర్మించే పనుల్లో కిమ్‌ ఉన్నారని.. చర్చలకు రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని వేదికగా ఎంచుకున్నారన్న వార్తలు వస్తున్నాయి.