Aurangzebs Descendants Now Rickshaw Pullers : మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, అతని వంశంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ 17వ శతాబ్దపు మొఘల్ చక్రవర్తి సంతానం ఇప్పుడు కోలకతా సమీపంలో నివసిస్తోందని, రిక్షా కార్మికులుగా జీవనోపాధి పొందుతున్నారని ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. "ఔరంగజేబు వారసులు కోల్ కతా సమీపంలో నివసిస్తున్నారని, రిక్షా కార్మికులుగా పనిచేస్తున్నారని నాకు తెలిసింది. ఔరంగజేబు దేవాలయాలను, ధార్మిక స్థలాలను ధ్వంసం చేయకపోతే బహుశా అతని వంశానికి ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేది కాదు" అని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు.
హిందూ దేవాలయాల చారిత్రక విధ్వంసాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన యోగి ఆదిత్యనాథ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువుల దేవాలయాలను పదేపదే ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. కాశీ విశ్వనాథ దేవాలయంలో, అయోధ్యలోని రామజన్మభూమిలో, మథురలోని కృష్ణ జన్మభూమిలో, కల్కి అవతార్ హరిహర భూమిలోని సంభాల్లో, భోజ్ పూర్ లో హిందువుల ఆలయాలను చాలా సార్లు ధ్వంసం చేశారన్నారు. ఇక్కడ దేవాలయాలను పగులగొట్టి అపవిత్రం చేశారని మండిపడ్డారు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో హిందూ మైనారిటీల దుస్థితిపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. సనాతన విలువలను పరిరక్షించాలని పిలుపునిచచారు. మన ఋషులు వేల సంవత్సరాల క్రితం వసుధైవ కుటుంబకం అనే భావనను ప్రపంచానికి ఇచ్చారని.. సంక్షోభ సమయాల్లో సనాతన ధర్మం అన్ని మతాలకు ఆశ్రయంగా నిలిచిందని గుర్తు చేశారు. కానీ హిందువులను అలానే చూడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో, గతంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో జరిగిన హింస హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచం ముందు ఉంచుతోందని అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ దేశంలో కొనసాగుతున్న మందిర్-మసీదు వివాదాలను లేవనెత్తడం ఆమోదయోగ్యం కాదని ఒక్క రోజు ముందే వ్యాఖ్యానించారు. అయినప్పటికీ యోగి ఈ వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. 17వ శతాబ్దంలో భారతదేశాన్ని పరిపాలించిన ఔరంగజేబు భారత చరిత్రలో తిరుగులేని వ్యక్తి. కొందరు ఆయనను సమర్థుడైన పరిపాలనాదక్షుడిగా వాదిస్తూంటారు. మరికొందరు ఆయన మత విధానాలను, ఆయన హయాంలో దేవాలయాలను ధ్వంసం చేశారని చెబుతూంటారు. ఆయన వారసులు కోల్ కతాలో రిక్షా పుల్లర్స్ అని చెప్పడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ కొత్త చర్చను ప్రారంభించారని అనుకోవచ్చు.
Also Read: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !