Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్‌ దాడి కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు.  ఈ క్రమంలోనే కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. బిభవ్‌ కుమార్‌ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి అడిగే క్రమంలో దీన్ని సీరియస్‌ కేసుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడి ఆమె ప్రాణాలు తీసి ఉండేదని, అంత తీవ్రంగా కొట్టాడని వెల్లడించారు. ఓ ఎంపీపై అలా అనుచితంగా ప్రవర్తించడాన్ని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని స్పష్టం చేశారు. పైగా నిందితుడు తమ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 


"ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఎంపీపై ఇంత దారుణంగా దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు పోయి ఉండేవి. ఈ ఘటనపై మేము ప్రశ్నలు వేస్తుంటే నిందితుడు ఏ మాత్రం నోరు మెదపడం లేదు. మా విచారణకు సహకరించడం లేదు. ఒక్కోసారి చాలా నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నాడు"


- ఢిల్లీ పోలీసులు


ఈ కేసుపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని కోర్టుకి వెల్లడించారు ఢిల్లీ పోలీసులు. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందని చెప్పారు. విచారణలో భాగంగా బిభవ్ కుమార్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ అడిగామని, కానీ నిందితుడు సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు. 2015 నుంచి కేజ్రీవాల్‌కి సహాయకుడిగా పని చేస్తున్నాడు బిభవ్ కుమార్. కావాలనే సాక్ష్యం లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు. ముంబయికి పంపించి మొబైల్‌ని అన్‌లాక్ చేయించే పనిలో ఉన్నామని వివరించారు.