ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన దాడి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. ప్రభుత్వం అందించే జడ్ కేటగిరీ భద్రతను స్వీకరించాలని ఓవైసీని కోరారు అమిత్ షా. హాపుర్ జిల్లాకు ఓవైసీ వస్తున్నట్లు అధికారులకు సమాచారమేమీ లేదని తెలిపారు. ఘటన తర్వాత ఓవైసీ సురక్షితంగా దిల్లీకి చేరుకున్నారని వివరించారు.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని షా తెలిపారు. కారును ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలు సేకరిస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఓవైసీకి ఇంకా భద్రతాపరమైన ముప్పు ఉందన్నారు.
దాడి ఇలా..
అసదుద్దీన్ ఓవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం దిల్లీకి తిరిగివస్తుండగా హపూర్-ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఓవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.