Arvind Kejriwal:
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు: భాజపా నేత
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై భాజపా నేతలు మండి పడుతున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా...ప్రజలందరూ ఇంటిపై త్రివర్ణపతాకం ఎగరేయాలని చెప్పారు కేజ్రీవాల్. హర్ హాథ్ తిరంగా అనే కొత్త కార్యక్రమానికీ పిలుపునిచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన ఆగస్టు 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు దిల్లీ వాసులంతా
జాతీయ గీతాన్ని ఆలపించాలని సూచించారు. దీనిపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భాజపా నేత అమిత్ మాల్వియా అరవింద్ కేజ్రీవాల్‌పై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. "ఆగస్టు 14న జాతీయ గీతం ఆలపించాలా..? రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. భారత్‌కు ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందని తెలియదా..? ఆయన "జిన్నావాలీ ఆజాదీ" అని అర్థమవుతోంది" అంటూ ట్వీట్ చేశారు. ఆగస్టు 14న పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజునే జాతీయ గీతం ఆలపించాలని కేజ్రీవాల్ పిలుపునివ్వటాన్ని ఉద్దేశిస్తూ...అమిత్ మాల్వియా ఇలా విమర్శలు చేశారు.
దిల్లీలో భద్రత పెంపు
స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు నిఘా పెంచారు. ఎర్రకోట వద్ద దాదాపు వెయ్యి కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దిల్లీ వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఎలా జరుగుతున్నాయో ఇక్కడి నుంచే పరిశీలించనున్నారు. నార్త్, సెంట్రల్ దిల్లీలోని పోలీసులకు..ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. భద్రతను పటిష్ఠం చేయాలని చెప్పారు. ఈ కెమెరాలతో వీవీఐపీ దారులపైనా నిఘా ఉంచేందుకు వీలవుతుంది.
Also Read: Har Ghar Tiranga Campaign: ‘హర్ ఘర్ తిరంగా’లో మీ పేరును ఇలా నమోదు చేస్కోండి, ఈ సర్టిఫికెట్ పొందండి