భారత్, చైనా సరిహద్దుల్లో జవాన్లు గల్లంతు


అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో భారత్‌తో చైనా ఎలా కయ్యం పెట్టుకుంటుందో ప్రపంచమంతా తెలిసిన విషయమే. సరిహద్దు వివాదం చెలరేగిన ప్రతిసారీ అరుణాచల్‌ప్రదేశ్‌ అంశాన్నీ ప్రస్తావించటం డ్రాగన్ దేశానికి అలవాటు. అందుకే ఎప్పుడూ ఈ రాష్ట్రం వార్తల్లో నిలుస్తుంది. దాదాపు పదిరోజులుగా మరోసారి దేశవ్యాప్తంగా అరుణాచల్ ప్రదేశ్ పేరు మారుమోగుతోంది. ఇందుకు కారణం..ఈ ప్రాంతంలో ఇద్దరు భారత సైనికులు కనిపించకుండా పోవటం. భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జవాన్లు గల్లంతవటం చర్చనీయాంశమైంది. గత నెల 28వ తేదీ నుంచే వీళ్లు కనిపించకుండా పోయినట్టు సమాచారం. గల్లంతైన సైనికులు ఉత్తరాఖండ్‌కు చెందిన హరేంద్ర నేగి, ప్రకాశ్‌ సింగ్‌ రాణాగా ఉన్నతాధికారులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకూ సమాచారం అందించారు. అప్పటి నుంచి వాళ్లు కంటి మీద కునుకు లేకుండా నిరీక్షిస్తున్నారు. అయితే భారత సైన్యం మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. తన భర్త కనిపించటం లేదంటూ గత నెల మే29వ తేదీన తనకు అధికారులు కాల్ చేసి చెప్పారని ప్రకాశ్ రాణా భార్య మమతా రాణా ఓ వార్తా సంస్థకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవలే మరోసారి కాల్ చేసి వాళ్లిద్దరూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి చనిపోయినట్టు భావిస్తున్నామని అధికారులు చెప్పినట్టు మమత చెబుతున్నారు. ఈ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అసలేం జరిగిందో అధికారులు వివరంగా చెప్పాలని కోరుతున్నారు. ఇప్పటికే అధికారులు అందించిన సమాచారంతో ఇద్దరి సైనికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. 



అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా అభ్యంతరాలేంటి..? 


అంతర్జాతీయ చిత్రపటాల్లో అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగానే ఉంది. చైనా మాత్రం టిబెట్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్‌ కూడా తమదేనని వాదిస్తోంది. ఈ ప్రాంతం దక్షిణ టిబెట్‌ అని పదేపదే చెబుతోంది. మొదట్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్‌ ఉత్తర భాగం తమదేనని చైనా చెప్పేది. ఇక్కడ భారత దేశంలోనే అతిపెద్ద బౌద్ధ మందిరం ఉంది. చైనా-భారత్ మధ్య మెక్‌మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖగా భావిస్తారు. కానీ చైనా దాన్ని అంగీకరించటం లేదు. టిబెట్‌లో అత్యధిక భాగం భారత్ అధీనంలో ఉందని ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది. 1950వ దశకం చివర్లో టిబెట్‌ను తనలో కలుపుకుంది చైనా. తరవాత అక్సాయ్ చీన్‌ నుంచి సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించింది. చైనా ఇక్కడే నేషనల్ హైవే 219 నిర్మించింది. అది దీనిని తూర్పు ప్రాంతం షింజియాంగ్‌కు జోడిస్తుంది. భారత్ మాత్రం దీన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని విమర్శిస్తోంది. ఇలా అరుణాచల్‌ ప్రదేశ్‌ కేంద్రంగా చైనా, భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది.