APJ Abdul Kalam Death Anniversary: 


అమ్మ నవ్వితే..కుటుంబం నవ్వినట్టే..


మిసైల్ మ్యాన్, మాజీ భారత రాష్ట్రపతి వర్దంతి సందర్భంగా అందరూ ఆయనను స్మరించుకుంటున్నారు. శాస్త్రవేత్తగా ఆయన దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆయన చేసిన స్ఫూర్తిమంతమైన ప్రసంగాలను, పాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ అబ్దుల్ కలాం పాత వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో అబ్దుల్ కలాం అమ్మ గురించి మాట్లాడారు. రోజూ అమ్మను ఎందుకు నవ్వించాలి, అందుకోసం ఏం చేయాలో చెప్పారు కలాం. ఓ వేదికపై అబ్దుల్ కలాం ప్రసంగిస్తుండగా ఎదురుగా కొందరు కూర్చుని వింటున్నారు. ఈ స్పీచ్‌లో భాగంగానే ఆయన "అమ్మని రోజూ నవ్వించండి" అని చెప్పారు. "ఓసారి నేను తిరుపతికి వెళ్లినప్పుడు అక్కడ చిన్నారులతో ఓ ప్రతిజ్ఞ చేయించాను" అంటూ మొదలైంది కలాం ప్రసంగం. "నిజానికి ఇది యువత కోసం. 20 ఏళ్ల లోపున్న వారి కోసమే ఈ ప్రతిజ్ఞ. కానీ...పెద్ద వాళ్లు కూడా ఈ ప్రతిజ్ఞ చేయొచ్చు" అని అన్నారు కలాం. ఆయన చెప్పటమే కాకుండా, ఎదురుగా ఉన్న వారితోనూ ఈ ప్రతిజ్ఞ చేయించారు. "ఇవాళ్టి నుంచి రోజూ మా అమ్మను నవ్విస్తాను" అని ఆయన చెప్పటమే కాకుండా అందరితోనూ చెప్పించారు. "అమ్మ నవ్వినప్పుడే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది" అని అన్నారు. ఇది చూసిన నెటిజన్లు కలాం స్పీచ్‌కు ఫిదా అయిపోయారు. "వి లవ్‌ యూ కలాం సర్" అంటూ కామెంట్ చేస్తున్నారు. అబ్దుల్ కలాం తన ప్రసంగాలతో విద్యార్థుల్లోనూ స్ఫూర్తి నింపేవారు. పదేపదే పిల్లలతో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించి వారితో మాట్లాడేవారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పేవారు.