AP TSAssembly Seats : తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పుడల్లా లేదని కేంద్రం స్పష్టం చేసింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. అసెంబ్లీ స్థాలన పెంపుపై రాజ్యసభ లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153కి అసెంబ్లీ స్థానాలు పెంపు ఉంటుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించే వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు.
ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచాల్సి ఉంది. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రం చెబుతోంది. గతేడాది కూడా లోక్ సభలో కేంద్రమే 2031 వరకు పెంపు లేదని స్పష్టం చేసింది.
కాంప్లెక్స్ ను కూల్చేస్తానంటూ జేసీ ప్రభాకర్ మాస్ వార్నింగ్!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం.. 2001లో చేపట్టిన 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు లోక్‌సభ సీట్ల పునర్విభజనను ఫ్రీజ్ చేసి పెట్టారు. జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సీట్ల విభజన చేపట్టాల్సి ఉంది. అప్పటివరకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల విభజన కూడా స్తంభించిపోతుందన్న అభిప్రాయాలున్నాయి. కానీ, జనగణనతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచుకునే అవకాశం ఉంది. అందుకే గతంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేశాయి.
కేంద్రం కూడా ఈ అంశంపై అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంది. సీట్లు పెంచాలని అనుకుంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ అభిప్రాయం చెప్పడం తో తెలుగు రాష్ట్రాల ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లయింది.ఈ అంశం తెర వెనుక్కు వెళ్లిపోయింది.